Engineering Student: ఇంజినీరింగ్‌ మధ్యలో హిజ్రాగా మారి

31 Aug, 2022 08:04 IST|Sakshi
కళాశాల సీటు కేటాయింపు పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌ ఆల్బీజాన్‌ వర్గీష్‌  

చదువుకు దూరమైన విద్యార్థి 

కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితుడు 

ప్రభుత్వ కళాశాలలో సీటు కేటాయింపు

సాక్షి, చెన్నై: ఇంజినీరింగ్‌ చదువుతూ హిజ్రాగా మారిన ఓ యువకుడిని చదువు కొనసాగించేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో బాధితుడు కలెక్టర్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరికి చెందిన కూలీ తెన్నరసు, శశికళ కుమారుడు లోకేష్‌. రెడ్‌హిల్స్‌ సమీపంలోని ఆర్‌వీఎస్‌ పద్మావతి ఇంజినీరింగ్‌ కళాశాలలో 2018లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కోర్సులో చేరాడు.

రెండో సెమిస్టర్‌ పూర్తయిన తరువాత లోకేష్‌ హిజ్రాగా మారి గెజిట్‌లో ఓవియాగా పేరును మార్చుకున్నాడు. అంత వరకు సాఫిగా సాగిన లోకష్‌ కళాశాల జీవితం పూర్తిగా మారిపోయింది. హిజ్రాగా మారిన లోకేష్‌ అలియాస్‌ ఓవియాకు కళాశాల అనుమతి నిరాకరించింది. దీంతో మద్యలోనే ఇంజినీరింగ్‌ విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చదువుపై మక్కువతో 2022–23వ సంవత్సరంగానూ డిగ్రీ చేయాలని పచ్చప్ప కళాశాలలో హిజ్రా కోటాలో సీటు ఆశించింది.

అయితే హిజ్రా కోటాకు సంబందించి ప్రభుత్వం ఉత్తర్వులు లేకపోవడం, వయస్సు దాటడంతో సీటును నిరాకరించారు. దీంతో ఓవియా గత 18న కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి పరిస్థితిని వివరించి కళాశాలలో సీటు ఇప్పించాలని కోరింది. ఈ సంఘటనపై స్పందించిన కలెక్టర్‌ పొన్నేరిలో ప్రభుత్వ కళాశాలలలో బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ సీటు కేటాయిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం ఓవియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఓవియా మాట్లాడుతూ.. బాగా చదువుకుని టీచర్‌గా రాణిస్తానని మీడియాకు వివరించింది.  

చదవండి: (సీఎం స్టాలిన్‌ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..)

మరిన్ని వార్తలు