Nitish Kumar: ఇదేమైనా ఇంగ్లాండ్ అనుకున్నావా? అధికారిపై సీఎం నితీష్ ఆగ్రహం

22 Feb, 2023 10:21 IST|Sakshi

పాట్నా: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంగ్లీష్‌ మాట్లాడినందుకు ఓ అధికారిపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాట్నాలోని బాపు సభాగర్‌ ఆడిటోరియంలో మంగళవారం ‘నాలుగో వ్యవసాయం రోడ్‌మ్యాప్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం నితీష్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లఖిసరాయ్‌కు చెందిన వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్‌ కుమార్‌ సీఎం నితీశ్‌ను ప్రశంసిస్తూ మాట్లాడటం ప్రారంభించారు.

‘పుణెలో మంచి కెరీర్‌ కలిగిన మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నేను అన్నింటినీ వదులుకుని నా సొంత జిల్లాలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. అయితే అమిత్‌ తన ప్రసంగంలో అధికంగా ఇంగ్లీష్‌ పదాలనే ఉపయోగించారు. దీంతో వెంటనే సీఎం నితీష్‌కుమార్‌ మధ్యలో జోక్యం చేసుకున్నారు. మీరు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారంటూ అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఇదేమైనా ఇంగ్లాండ్‌ అనుకున్నారా? ఇది భారత్‌.. బిహార్‌ రాష్ట్రం అంటూ మండిపడ్డారు. 

‘‘మీరు అతిగా ఆంగ్ల పదాలు మాట్లాడటం వల్ల నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. మిమ్మల్ని సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి ఆహ్వానించారు. కానీ మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఇదేమన్నా ఇంగ్లాండా? మీరు బిహార్‌లో పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్‌ స్కీమ్స్‌ అనే బదులు సర్కారీ యోజన అనలేరా. నేనూ ఆంగ్ల మాధ్యమంలో ఇంజనీరింగ్‌ చదివాను. అది వేరే విషయం. రోజూవారీ కార్యకలాపాలకు మాతృ భాషను ఉపయోగించాలి.

కోవిడ్‌, లాక్‌డౌన్‌ సమయంలో స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్‌ అవ్వడం వల్ల చాలామంది ప్రజలు తమ మాతృ భాషలను మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇది సరికాదు. మన రాష్ట్రంలో మాట్లాడే భాషనే ఉపయోగించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం సదరు అధికారి ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనే విషయం తెలిసిందే. ఇదే రోజున బిహార్ సీఎం మాతృభాషపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చదవండి: ఆయిల్ లీక్.. ఎయిర్‌ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మరిన్ని వార్తలు