'షమీ భార్యకు భద్రత కల్పించండి'

30 Sep, 2020 16:39 IST|Sakshi

కోల్‌కత : టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్‌ జహాన్‌కు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల రామ్‌ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగ్గా.. హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వివాదం రేపింది. దీనిపై సోషల్‌ మీడియా కొందరి నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని.. తన కూతురుకు,తనకు ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. (చదవండి : చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా)

తాజాగా కలకత్తా హైకోర్టు మంగళవారం హసీన్‌ పిటీషన్‌ను పరీశీలించింది. హసీన్‌ తరపు లాయర్‌ ఆశిష్‌ చక్రవర్తి.. ఆమెకు సోషల్‌మీడియాలో వచ్చిన బెదిరింపులతో పాటు పోలీసులకు అందించిన ఫిర్యాదును రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించారు. హసీన్‌ తనకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాగా సీనియర్‌ న్యాయవాది అమితేష్‌ బెనర్జీ చక్రవర్తి వాదనలను తోసిపుచ్చుతూ.. హసీన్‌ జహాన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని.. కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఉందని తెలిపారు.

ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ దేబాంగ్సు బసక్.. హసీన్‌ జహాన్‌ ఆస్తికి, ఆమె జీవితానికి ఎటువంటి హాని జరగకుండా రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ మంగళవారం తెలిపారు. అంతేగాక హసీన్‌ ఫిర్యాదుతో  తీసుకున్న చర్యలను రిపోర్టు రూపంలో కోర్టుకు అందించాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అనంతరం జస్టిస్‌ పేర్కొన్నారు.

కాగా రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆడేందుకు దుబాయ్‌లో ఉన్నాడు. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరపున షమీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. (చదవండి : మాకు రక్షణ కల్పించండి: షమీ భార్య)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా