జూలైకి 25 కోట్ల మందికి టీకా

5 Oct, 2020 05:50 IST|Sakshi

40 నుంచి 50 కోట్ల డోసుల్ని సిద్ధం చేస్తాం: హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జూలై కల్లా దేశంలోని 20 నుంచి 25 కోట్ల మందికి సరిపోయేలా 40 నుంచి 50 కోట్ల కోవిడ్‌–19 టీకా డోసుల్ని సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ టీకాను ఇవ్వాల్సిన వారి పేర్లను ప్రాధాన్యతాక్రమంలో అక్టోబర్‌ చివరిలోగా అందజేయాలని రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆదివారం ఈ విషయం వెల్లడించారు.

కోవిడ్‌–19పై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీలో మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా ‘సండే సంవాద్‌’వేదికగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. కోవిడ్‌–19 పంపిణీపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తోందన్నారు. టీకా పంపిణీలో అనుసరించాల్సిన ప్రాధాన్యతా క్రమంపై రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఈ కమిటీ ఒక ఫార్మాట్‌ను తయారు చేస్తోందని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంలో కోవిడ్‌–19 ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని ఆరోగ్య సిబ్బందికి ఇస్తామన్నారు. 

‘టీకా సేకరణ బాధ్యతను కేంద్రమే తీసుకుంది. అది సిద్ధమయ్యాక అందరికీ సమానంగా, నిష్పక్షపాతంగా అందించేందుకు చేపట్టే ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోంది’అని చెప్పారు. ‘దేశంలోని వివిధ సంస్థలు టీకా అభివృద్ధి కోసం సాగిస్తున్న ప్రయత్నాలు.. అవి ఏ దశలో ఉన్నాయనే అంశాన్ని ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు ఆయా సంస్థల నుంచి సేకరించే టీకాపై ముందుగానే హామీ తీసుకుంటోంది’అని అన్నారు.  తయారైన టీకాను పక్కదారి పట్టించడం, బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం వంటి వాటికి తావు లేదన్నారు.  రష్యా టీకా స్పుత్నిక్‌–వీకి భారత్‌లో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చే అంశం పరిశీలనలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

కోవిడ్‌ కేసులు 65 లక్షలు పైనే
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19  కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 75,829 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,49,373కు చేరుకుంది. అదే సమయంలో 940 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,01,782 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 55,09,966కు చేరుకుంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,37,625గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 14.32 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 84.13 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.55 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి  278 మంది మరణించారు. ఈ నెల 3 వరకూ 7,89,92,534 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శనివారం మరో 11,42,131  పరీక్షలు జరిపినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు