పర్యావరణ పరిరక్షణ మన విధి: మోదీ

23 Feb, 2023 05:12 IST|Sakshi

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ అనేది భారత్‌కు అంకితభావంతో నిర్వర్తించే విధి తప్ప బలవంతంగా చేసే పని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రకృతి, అభివృద్ధి అనేవి కలిసి ముందుకు సాగాలని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ అవసరాలను పునరుత్పాదక, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి తీర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు.

ఈ మేరకు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని ద ఎనర్జీ, రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌(టీఈఆర్‌ఐ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వరల్డ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సదస్సు(డబ్ల్యూఎస్‌డీఎస్‌)లో చదివి వినిపించారు. నగరాలు, పట్టణాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆధునిక సాంకేతికత, నవీన ఆవిష్కరణ ద్వారా పరిష్కార మార్గాలు కనుగొంటున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. భూమిని తల్లిగా, మనమంతా ఆ తల్లి బిడ్డలమని మన ప్రాచీన గ్రంథాలు అభివర్ణించాయని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణలో మన దేశం ముందంజలో నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు.­

మరిన్ని వార్తలు