కరోనాతో ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే డబ్బులు డ్రా చేయడం ఎలా?

19 May, 2021 18:11 IST|Sakshi

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2.83 లక్షలు. కరోనాతో మరణించిన వారిలో ధనవంతుల నుంచి దినసరి కూలీల వరకు ఉన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు/ఖాతాదారులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న సందేహాలు వస్తున్నాయి. సాధారణంగా పదవి విరమణ తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీ మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ పథకం కింద రూ.7 లక్షల వరకు బీమా డబ్బులు ఉద్యోగి కుటుంబ సభ్యులకు లభిస్తాయి. చనిపోయినవారి ఈపీఎఫ్ ఖాతా నుంచి వారి కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోవడానికి నామినీ ఈపీఎఫ్ ఫారం 20 ద్వారా ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణను పొందవచ్చు. సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ -19 వల్ల చాలా మంది చనిపోతున్నందున, ఈ బీమా ప్రయోజనం మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎంతో సహాయపడుతుంది. మరణించిన వ్యక్తికి నామినీ లేకపోతే, చట్టబద్ధమైన వారసుడు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

ఫారం 20 నింపేటప్పుడు ఈపీఎఫ్ సభ్యుడి పేరు, తండ్రి / భర్త పేరు, సభ్యుడు చివరిగా పనిచేసిన సంస్థ పేరు & చిరునామా, ఈపీఎఫ్ ఖాతా సంఖ్య, చివరి పనిదినం, ఉద్యోగం మానెయ్యడానికి కారణం(మరణించిన సభ్యుడి విషయంలో “మరణం” పేర్కొనండి), మరణించిన తేదీ (dd / mm / yyyy), అతని / ఆమె మరణించిన రోజున సభ్యుడి వైవాహిక స్థితి వంటి వివరాలు నింపాలి. అలాగే, నామినీ/చట్టబద్ధమైన వారసుడు వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. నామినీ/చట్టబద్ధమైన వారసుడు పేరు, తండ్రి / భర్త పేరు, లింగం, వయస్సు (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), వైవాహిక స్థితి (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), మరణించిన సభ్యుడితో సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి.

అలాగే, పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పొందాలనుకుంటే ఆ కాలమ్ టిక్ చేయాలి. లేదా అకౌంట్ ద్వారా పొందాలనుకుంటే అకౌంట్ వివరాలు, క్యాన్సల్డ్ చెక్ సబ్మిట్ చేయాలి. నామినీ/ హక్కుదారుడు ఆధార్ లింకైన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. క్లెయిమ్ ప్రాసెస్‌లో పలు దశల్లో ఎస్ఎంఎస్‌లు వస్తాయి. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పొందాలంటే క్యాన్సల్డ్ చెక్ ఇవ్వడం తప్పనిసరి. పూర్తి అడ్రస్ పిన్‌కోడ్‌తో సహా వెల్లడించాలి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది.

చదవండి:

టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి

మరిన్ని వార్తలు