డిసెంబర్‌లో 12.53 లక్షల కొత్త ఉద్యోగాలు 

26 Feb, 2021 08:17 IST|Sakshi

డిసెంబర్‌లో 12.53 లక్షల కొత్త ఉద్యోగాలు

ఈపీఎఫ్‌వోలో నమోదు 

ఈఎస్‌ఐసీ కిందకు 12.06 లక్షల మంది

సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి పథకం(ఈపీఎఫ్‌)లో 2020 డిసెంబర్‌లో కొత్తగా 12.53 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2020 నవంబర్‌లో కొత్త సభ్యులు 8.70 లక్షల మందితో పోలిస్తే 40 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2017 సెప్టెంబర్‌ నుంచి 2020 డిసెంబర్‌ వరకు ఈపీఎఫ్‌ పథకంలో 3.94 కోట్ల మంది సభ్యులుగా నమోదైనట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అదే విధంగా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ)లోకి 2020 డిసెంబర్‌ నెలలో 12.06 లక్షల మంది నూతన సభ్యులుగా నమోదయ్యారు. అంతకుముందు నెలలో (2020 నవంబర్‌) సభ్యుల నమోదు 9.48 లక్షలతో పోలిస్తే పెరిగింది. 2017 సెప్టెంబర్‌ నుంచి 2020 డిసెంబర్‌ వరకు ఈఎస్‌ఐసీలో 4.63 లక్షల మంది కొత్తగా చేరినట్టు ఎన్‌ఎస్‌వో నివేదిక తెలియజేసింది. ఈపీఎఫ్‌తో పాటు పలు సామాజిక భద్రతా పథకాల్లో నూతన సభ్యుల నమోదు గణాంకాల ఆధారంగా ఎన్‌ఎస్‌వో ఈ నివేదికను రూపొందించింది. 2018 ఏప్రిల్‌ నుంచి ఎన్‌ఎస్‌వో వివరాలను విడుదల చేస్తూ వస్తోంది.(రిటైల్‌ రుణ గ్రహీతలకు కష్ట కాలమే!)

మరిన్ని వార్తలు