రెండు దఫాలుగా ఈపీఎఫ్ వడ్డీ

9 Sep, 2020 20:34 IST|Sakshi

ఫండ్‌పై  ప్రస్తుతానికి 8.15 శాతం వడ్డీ మాత్రమే 

మిగిలిన బకాయి డిసెంబరులో

సాక్షి, న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీని రెండు దఫాలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్‌ పై ప్రస్తుతానికి కొంత భాగాన్ని..8.5 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. మిగిలిన దాన్ని డిసెంబరులో చెల్లించనుంది. దీనిపై ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ), డిసెంబరులో మరోసారి సమావేశం కానుంది. 

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈపీఎఫ్ ఖాతాల్లోని ఫండ్‌పై 8.15 శాతం వడ్డీని ప్రస్తుతం జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో జమ చేయనుంది. ఈక్విటీ పెట్టుబడుల డైల్యూషన్ ద్వారా 0.35 శాతం బకాయి వడ్డీని డిసెంబర్‌లో చెల్లించేలా బుధవారం జరిగిన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశం నిర్ణయించింది. కోవిడ్-19 అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా, వడ్డీ రేటుకు సంబంధించిన ఎజెండాను కేంద్ర బోర్డు సమీక్షించింది. అలాగే కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఇడిఎల్ఐ) పథకం కింద ఉన్న గరిష్ట హామీ ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ .6 లక్షల నుండి రూ .7 లక్షలకు పెంచింది. దీంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 

కాగా లక్ష కోట్ల రూపాయల విలువైన ఈటీఎఫ్ పెట్టుబడులపై నష్టాలు రావడం చందాదారుల చెల్లింపును దెబ్బతీసినట్టు  సమాచారం. వార్షిక డిపాజిట్లలో, ఇపిఎఫ్ఓ 85 శాతం రుణ సాధనాలలో, 15 శాతం ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెడుతుంది. మరోవైపు కరోనా సంక్షోభ కాలంలో క్లెయిమ్‌ల సంఖ్యం మొత్తం 13 శాతం పెరిగింది. ఏప్రిల్-ఆగస్టు కాలంలో మొత్తం  35,445 కోట్ల విలువైన 94.41 లక్షల క్లెయిమ్‌లను చెల్లించింది.  గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ.

మరిన్ని వార్తలు