ఈఎస్‌ఐ సభ్యులు నేరుగా ప్రైవేట్‌ ఆసుపత్రికెళ్లొచ్చు

8 Dec, 2020 05:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) సభ్యులు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో తమ సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి నేరుగా ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఈ వెసులుబాటును సంస్థ యాజమాన్యం కల్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం.. ఈఎస్‌ఐసీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు(లబ్ధిదారులు) తొలుత ఈఎస్‌ఐసీ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడి వైద్యుల సిఫార్సు మేరకు ప్రైవ్రేట్‌ హాస్పిటళ్లలో చేరొచ్చు.

ఎమర్జెన్సీ కేసుల విషయంలో ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండానే నేరుగా ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లి, సేవలు పొందవచ్చని టీయూసీసీ జనరల్‌ సెక్రెటరీ ఎస్‌.పి.తివారీ చెప్పారు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని వల్ల ఎంతోమంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. గుండె పోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు