56.5 లక్షల టీకా డోసుల తరలింపు

13 Jan, 2021 05:08 IST|Sakshi
గురుగ్రామ్‌లో పోలీసు భద్రతతో వెళ్తున్న కోవిషీల్డ్‌ టీకా ట్రక్కు

మొదటి రోజు పుణే నుంచి విమానాల్లో ‘కోవిషీల్డ్‌’

ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ సహా 13 నగరాలకు 

న్యూఢిల్లీ/పుణే: ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం కోవిషీల్డ్‌ , కోవాగ్జిన్‌ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు ఆర్డర్లు జారీ చేయగా మంగళవారం ఉదయం నుంచి మొదటి విడత టీకా తరలింపు ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు నాలుగు రోజులు ముందుగానే సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన కేంద్రం పుణే నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా 13 నగరాలకు 56.5 లక్షల డోసులకు పైగా కోవిషీల్డ్‌ టీకాను తరలించారు. మొదటి రోజున నాలుగు విమాన సంస్థలకు చెందిన 9 విమానాలు 11 టన్నుల బరువున్న టీకాను తరలించాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ట్విట్టర్‌లో ప్రకటించారు. పుణే నుంచి స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ ఇండియా, ఇండిగో సంస్థల విమానాలు ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, కోల్‌కతా, భువనేశ్వర్, పట్నా, లక్నో, కర్నాల్, ముంబై నగరాల్లో సిద్ధం చేసిన రాష్ట్ర స్థాయి డిపోలకు కోవిషీల్డ్‌ డోసులను తీసుకెళ్లాయన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి కోవిషీల్డ్‌ 1.1 కోట్ల డోసులు, కోవాగ్జిన్‌ 55 లక్షల డోసులు నిర్దేశించిన కేంద్రాలకు చేరుతాయని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు 54.72 లక్షల డోసుల కోవిషీల్డ్‌ టీకా బాక్సులు చేరుకున్నట్లు ప్రకటించింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పూర్తయిన 14 రోజుల తర్వాతే టీకా ప్రభావం కనిపిస్తుందని చెప్పారు.

పుణేలో పూజలు
పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పూజల అనంతరం కోవిషీల్డ్‌ టీకా ఉన్న ట్రక్కులు అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని పుణే విమానాశ్రయానికి చేరుకున్నాయి. టీకా బాక్సులతో ఉదయం 8 గంటలకు బయలుదేరిన స్పైస్‌ జెట్‌ విమానం ఢిల్లీకి 10 గంటలకు చేరుకుందని మంత్రి హర్దీప్‌ సింగ్‌ తెలిపారు. అలాగే, ఇండిగో విమానాలు చండీగఢ్, లక్నోలకు, స్పైస్‌ జెట్‌ గువాహటి, కోల్‌కతా, హైదరాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, పట్నా, విజయవాడకు, గో ఎయిర్‌ విమానం చెన్నైకు వెళ్లాయి.

రేసులో మరో నాలుగు టీకాలు
అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలంటూ మరో నాలుగు టీకా తయారీ సంస్థలు త్వరలోనే డీసీజీఐకి దరఖాస్తు చేసుకునే అవకాశా లున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ ముందుంజలో ఉన్న జైడస్‌ క్యాడిలా, స్పుత్నిక్‌–వీ, బయోలాజికల్‌ ఈ, జెన్నోవా వీటిల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుత రెండు వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్టుల ప్రమాదం లేదనీ, సురక్షితమైనవని మంగళవారం నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు.

కోవాగ్జిన్‌ ధర ఎంతంటే..
కోవాగ్జిన్‌ టీకా మొత్తం డోసులు 55 లక్షలు. కాగా, ఇందులో రూ.295 చొప్పున 38.5 లక్షల డోసులు, మిగతా 16.5 లక్షల డోసులు ఉచితం కాగా అంతా కలిపి డోసు ధర సరాసరిన రూ.206 అవుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. 

వివిధ టీకాల ధరలు..
ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న టీకా ధరలను భూషణ్‌ వివరించారు. ఫైజర్‌ డోసు రూ.1,431, మోడెర్నా రూ.2,348 నుంచి రూ.2,715 వరకు, సినోవాక్‌ రూ.1,027, నోవావ్యాక్స్‌ రూ.1,114, స్పుత్నిక్‌ వీ రూ.734, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ధర రూ.734కు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వీటిల్లో ఫైజర్‌ టీకా మైనస్‌ 70 డిగ్రీల వద్ద మినహా మిగతా వాటన్నిటినీ 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచవచ్చన్నారు. 

కోవాగ్జిన్‌ ప్రయోగాల్లో ఉల్లంఘనలు? 
సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తున్న కోవాగ్జిన్‌ ప్రయోగ టీకా తీసుకున్న 9 రోజుల వ్యవధిలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వలంటీర్‌ మరణించడం వ్యాక్సిన్‌ సమర్థతపై కలకలం రేపుతోంది. తమ వ్యాక్సిన్‌ కారణంగా ఆ వలంటీర్‌ మరణించలేదని కంపెనీ చెప్పుకున్నప్పటికీ భోపాల్‌లో భారత్‌ బయోటెక్‌ నిర్వహించిన ప్రయోగాల తీరు సందేహాలకు తావిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత్‌ బయోటెక్‌ మూడో దశ ప్రయోగాల నిబంధనలను ఉల్లంఘించిందని, యూనియన్‌ కార్బైడ్‌ గ్యాస్‌ ప్రమాద బాధితుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే ప్రయోగ టీకాలు ఇచ్చిందని భోపాల్‌ దుర్ఘటన బాధితుల కోసం పనిచేస్తున్న కొందరు సామాజిక కార్యకర్తలు ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ప్రస్తుతం ఈ ఉదంతం అందరి దృష్టిలోకి వచ్చింది.  

మా సమ్మతి తీసుకోలేదు: బాధితులు 
భోపాల్‌లో కోవాగ్జిన్‌ ప్రయోగాలను నిర్వహించిన పీపుల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ తమ నుంచి ఎలాంటి సమ్మతి తీసుకోలేదని ప్రయోగాల్లో పాల్గొన్న బాధితులు స్వయంగా మీడియా ముందు ఆరోపించారు. చదవడం, రాయడం తెలియని తమతో టీకా ప్రయోగానికి సమ్మతి తీసుకుంటున్నట్లు వీడియో రికార్డింగ్‌ కూడా నిర్వహించలేదని అన్నారు. 

అన్ని అనుమతులూ తీసుకున్నాం.. 
భోపాల్‌ ఘటనపై స్పందించిన భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ప్రయోగాల్లో మరణించిన వ్యక్తి నుంచి ముందుగానే అన్ని రకాల అనుమతులూ తీసుకున్నామని ప్రకటించింది. అంతేకాకుండా పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆ వ్యక్తి విష ప్రయోగం వల్ల గుండె, ఊపిరితిత్తులు పనిచేయకుండా మరణించాడని ఉందని చెప్పింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు