అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్‌

20 Jun, 2021 13:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: మాజీ మంత్రి మణికంఠన్‌ చిక్కారు. బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌ హౌస్‌లో తలదాచుకుని ఉన్న ఆయన్న చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆదివారం చెన్నై తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు.  మాజీ మంత్రి మణికంఠన్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, మూడుసార్లు బలవంతంగా అబార్షన్‌ చేయించాడని నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఆరు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఆయన్ను విచారించేందుకు చెన్నై పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్‌ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తూనే మరో వైపు ఆధారాల కోసం ఆయనకు పీఏగా, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారిని విచారించారు.

ఆయన వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి పత్తా లేకుండా పోయాడు. అలాగే బలవంతంగా మూడుసార్లు చాందినికి అబార్షన్‌ చేసిన డాక్టరును విచారించేందుకు పోలీసులు కసరత్తు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అందిన రహస్య సమాచారం మేరకు ఒక బృందం శనివారం బెంగళూరు వెళ్లింది. అక్కడి శివారులోని ఓ ఫామ్‌ హౌస్‌లో తలదాచుకుని ఉన్న మాజీ మంత్రిని అదుపులోకి తీసుకుంది. రాత్రికి రాత్రే చెన్నై తరలించిన పోలీసులు ఉదయాన్నే అడయార్‌ స్టేషన్‌లో ఉంచి తీవ్రంగా విచారణ చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి తీసుకునేందుకు సోమవారం పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. 
చదవండి: నటితో సహజీవనం: ఆమె ఎవరో తెలియదన్న మాజీ మంత్రి 

మరిన్ని వార్తలు