‘నిరూపిస్తే.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతాను’

17 Aug, 2020 08:59 IST|Sakshi
ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ మేయర్‌ శకుంతల భారతి(ఫైల్‌ ఫోటో)

లక్నో: బీజేపీ మాజీ మేయర్‌ ఒకరు ముస్లిం యువతుల మతం మార్చి.. వారికి హిందూ యువకులతో వివాహం జరిపిస్తున్నారని ఒక ముస్లిం యువతి ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యువతి అలీగఢ్‌ బీజేపీ మాజీ మేయర్‌ శకుంతల భారతిపై సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మేయర్‌ తన సోదరిపై ఒత్తిడి తెచ్చి.. మతం మార్చి హిందూ యువకుడితో వివాహం చేశారని ఆరోపించింది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువతి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ హిందూ యువకుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరి ఇంట్లో నుంచి బంగారు నగలు, డబ్బు తీసుకుని ఓ హిందూ యువకుడితో పరారయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలించడం ప్రారంభించారు. (వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్‌ చేసిన మోదీ)

ఈ లోపు యువతి కుటుంబ సభ్యులు బీజేపీ మాజీ మేయర్‌ శకుంతల భారతి ముస్లిం యువతుల మతం మార్చి.. వారిని హిందూ యువకులకు ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే తన సోదరికి హిందూ యువకుడితో వివాహం చేసిందని తెలిపారు. పోలీసులు ఇంటి నుంచి వెళ్లి పోయిన యువతిని గుర్తించి.. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సదరు యువతి తన ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్లి పోయి.. హిందూ యువకుడిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. తాను మేజర్‌నని.. వివాహం విషయంలో ఎవరి బలవంతం లేదని పేర్కొంది. ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తన సోదరి అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించింది. ఇందులో మాజీ మేయర్‌కు ఎలాంటి సంబంధం లేదంది. తాను హిందూ యువకుడిని వివాహం చేసుకోవడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నది. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని సదరు యువతి పోలీసులకు తెలిపింది.

ఈ ఆరోపణలపై శకుంతల భారతి స్పందించారు. ‘సదరు యువతి వివాహం గురించి నాకు ఏం తెలియదు. అనవసరంగా నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. వారు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. నేను రాష్ట్రం విడిచి వెళ్లి పోతాను’ అన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా