మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్‌.. రెబల్స్‌కు ఉద్ధవ్‌ థాక్రే సవాల్‌

8 Jul, 2022 16:12 IST|Sakshi

మహారాష్ట్రలో ఊహించని ట్విస్టుల మధ్య శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. సీఎం పీఠాన్ని అధిరోహించారు. బీజేపీ మద్దతుతో షిండే కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేశారు. కాగా, శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం, కొత్త సీఎం షిండే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహారాష్ట‍్రలో మధ్యంతర ఎన్నికలు జరిపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో రెబల్‌ ఎమ్మెల్యేలకు దమ్ముంటే శివసేన గుర్తుతో కాకుండా వేరే గుర్తుతో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. శివసేన పార్టీ గుర్తు తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఈరోజే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని తాను సవాల్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిజంగా మేము తప్పు చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ప్రజలే మీకు తగిన బుద్దిచెబుతారని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు కేవలం శివసేన గుర్తును మాత్రమే చూడరు. ఆ గుర్తుతో పోటీ చేసే వ్యక్తిని కూడా చూస్తారని అన్నారు.  శివసేనను ఎవరూ తమ నుంచి లాక్కెళ్లలేరని అన్నారు. పార్టీలు పోయినంత మాత్రానా ఎక్కడైనా పార్టీ పోతుందా? అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పని చేసే రిజిస్టర్డ్ పార్టీ ఒకటి.. లెజిస్లేచర్ పార్టీ మరొకటి ఉంటుందని, ఈ రెండు వేర్వేరు అని వివరించారు. ఇలా చేయాలని అనుకుంటే.. రెండుననరేళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే కేంద్రంలో ఉన్న బీజేపీ.. గత రెండున్నర ఏళ్లుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. ఆ సమయంలో రెబల్‌ ఎమ్మెల్యేలంతా ఎక్కుడున్నారని ఫైర్‌ అయ్యారు. అలాంటి బీజేపీతో కలిసి.. మీరు(రెబల్‌ ఎమ్మెల్యేలు) సొం‍త పార్టీకి ద్రోహం చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ కొందరు శివసేన నేతలను బెదిరింపులకు గురిచేసినా కొంత ఎమ్మెల్యేలు నాకు మద్దతుగా నిలిచారు. వారిని చూసి నేను గర్విస్తున్నానని అన్నారు. 

దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల తాము ఆందోళనగా ఉన్నామని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని అన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆత్రుతగా చూస్తున్నారని వివరించారు. సుప్రీంకోర్టు నిర్ణయం గురించి తాను ఆందోళన చెందడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం దేశంలో సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. 

ఇది కూడా చదవండి: ఆ విషయం తేలకుండానే ప్రభుత్వ ఏర్పాటా? షిండేపై మళ్లీ కోర్టుకెక్కిన థాక్రే వర్గం

మరిన్ని వార్తలు