ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ సీఎం

29 Jan, 2021 11:50 IST|Sakshi

సిమ్లా: దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడు.. ఆరు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని.. కాకపోతే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని 86 ఏళ్ల వీరభద్ర సింగ్‌ తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్‌ పని చేశారు. 2017లో అధికారం నుంచి దిగిపోయిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం అర్కీలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పని చేస్తా’’ అని వీరభద్ర సింగ్‌ తన నియోజకవర్గానికి చెందిన వారితో చెప్పారు. వీరభద్ర సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్నాడు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వారిలో ఆయన ఒకరు. ఆయనపై బీజేపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం వాటి విచారణ కొనసాగుతోంది. 

అయితే వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుడుగా వీరభద్ర సింగ్‌ ఉన్నారు. 2012 నుంచి 2017 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంగా వ్యహరించారు. 1983 నుంచి 1990, 1993 నుంచి 98, 2003-07కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1962, 67, 71, 80, 2007లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.  ప్రస్తుతం ఈ రాష్ట్రానికి తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు