అందుకే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: ధనోవా

30 Oct, 2020 10:24 IST|Sakshi
భారత వైమానిక దళ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌(ఫైల్‌ ఫొటో)

ఆనాడు ఆహుజా విషయం మదిలో మెదిలింది

అభినందన్‌ను కచ్చితంగా తీసుకొస్తాం అని చెప్పాం

పాక్‌పై రెండు అంశాలు ప్రభావం చూపాయి

ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌ బీఎస్‌ ధనోవా

న్యూఢిల్లీ: ‘‘ఆరోజు నేను, అభినందన్‌ తండ్రి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాం. మేమిద్దరం కలిసి పనిచేసిన నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నాం. కార్గిల్‌ యుద్ధ సమయంలో నా ఫ్లైట్‌ కమాండర్‌ అహుజా పట్టుబడ్డారు. ఆయన విమానం కూలిపోయింది. అభినందన్‌ పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కినపుడు అహుజా విషయం నా మదిలో మెదిలింది. అప్పుడు.. ‘‘సర్‌.. అహుజాను వెనక్కి తీసుకురాలేకపోయాం. కానీ అభినందన్‌ను కచ్చితంగా తీసుకొస్తాం’’ అని నేను ఆయన తండ్రికి చెప్పాను. పాకిస్తాన్‌కు భారత్‌ సామర్థ్యమేమిటో తెలుసు. అందుకే అభినందన్‌ను అప్పగించారు’’ అని భారత మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా గతేడాది ఫిబ్రవరి నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.(చదవండి: పుల్వామా దాడి; పాక్‌ సంచలన ప్రకటన)

కాగా పాకిస్తాన్‌ ఎంపీ అయాజ్‌ సాదిఖ్‌ నేషనల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయని, ఆ సమయంలో అభినందన్‌ విడుదల చేయడమే తప్ప తమకు వేరే మార్గం లేదని మంత్రి చెప్పినట్లు ఆయాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. లేనిపక్షంలో భారత్‌ ప్రతీకారం తీర్చుకోనుందన్న సమాచారం నేపథ్యంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా కాళ్లు వణికాయని, ఒళ్లంతా చెమటతో తడిసిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌ ధనోవా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘ ఆనాడు పాకిస్తాన్‌పై రెండు అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఒకటి, దౌత్య, రాజకీయపరంగా వస్తున్న ఒత్తిడి. మరోవైపు భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలు తెలిసి ఉండటం. ఆయన(సాదిఖ్‌‌) చెప్పినట్లు అతడి(జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా) కాళ్లు వణకడం వంటివి జరిగింది అందుకే. ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సామర్థ్యం గురించి వారికి అవగాహన ఉంది. ఫిబ్రవరి 27న వాళ్లు దాడికి సిద్ధమయ్యారు. అందుకు దీటుగా బదులిచ్చేందుకు, వాళ్ల ఫార్వర్డ్‌ బ్రిగేడ్స్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు సన్నద్ధమయ్యాం.

అప్పటికే వాళ్లకు విషయం అర్థమైంది. భారత ఆర్మీని తట్టుకుని నిలబడిగే శక్తి తమ మిలిటరీకి ఉందా లేదా అన్న విషయం గురించి ఆలోచన మొదలైంది. ‘‘స్పీక్‌ సాఫ్ట్‌ అండ్‌ క్యారీ ఏ బిగ్‌ స్టిక్‌(శాంతియుతంగా చర్చలు జరుపుతూనే, తోకజాడిస్తే బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలనే అర్థంలో)’’ అని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ చెబుతూ ఉండేవారు కదా.. ఇక్కడ బిగ్‌స్టిక్‌గా మిలిటరీ పనిచేసింది. అభినందన్‌ను విడిచిపెట్టడం తప్ప వాళ్లకు వేరే మార్గం లేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: అప్పటికే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: పాక్‌ నేత))


బీఎస్‌ ధనోవా(ఫైల్‌ ఫొటో)

పాక్‌ ఆర్మీ దురాగతానికి బలైన ఆహుజా
కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో.. గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్‌ అభినందన్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్‌-21 కూలిపోవడంతో ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్‌ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ భారత్‌కు చేరుకున్నారు.

దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నెరవేర్చిన అభినందన్‌కు యావత్‌ భారతావని నీరాజనాలు పట్టింది. ఇక అభినందన్‌ తండ్రి ఎస్‌ వర్థమాన్ సైతం ఐఏఎఫ్‌ అధికారిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. కాగా స్వ్యాడ్రన్‌ లీడర్‌ అజయ్‌ ఆహుజా 1999లో పాకిస్తానీ సాయుధ బలగాల చేతిలో మరణించారు. తాను నడుపుతున్న మిగ్‌-21 కూలిపోవడంతో పాక్‌ ఆర్మీ చేతికి చిక్కిన ఆహుజా.. దేశ రక్షణకై ప్రాణాలు అర్పించారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు