కొలీజియం సిఫార్సులపై సాగదీత...

29 Jan, 2023 06:04 IST|Sakshi

ప్రజాస్వామ్యానికి పెను ముప్పు

న్యాయవ్యవస్థ కుప్పకూలుతుంది

జస్టిస్‌ నారిమన్‌

ముంబై: కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్‌ రిజిజు చేస్తున్న విమర్శలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ శనివారం తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘సాధారణ పౌరునిగా కొలీజియంతో పాటు ప్రతి వ్యవస్థనూ విమర్శించవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మాత్రం నియమ నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడి ఉండాల్సిందే’’ అన్నారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెడుతున్న వైనాన్ని ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా ఆయన అభివర్ణించారు. ‘‘నిర్భీతితో కూడిన స్వతంత్ర న్యాయమూర్తులు లేకుండా పోతే పరిస్థితేమిటి? న్యాయ వ్యవస్థ మన చివరి ఆశా కిరణం.

అది కూడా కుప్పకూలితే దేశానికిక చీకటి రోజులే. తప్పో, ఒప్పో.. 1993 నాటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కొలీజియం వ్యవస్థ పుట్టుకొచ్చింది. దాన్ని గౌరవించడం కేంద్రం విధి. ఎందుకంటే అన్ని వ్యవస్థలూ సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడాల్సిందే’’ అన్నారు. తనకు అనుకూలమైన కొలీజియం వచ్చి పాత సిఫార్సులపై పునరాలోచన చేస్తుందనేది కేంద్రం వైఖరి అని అభిప్రాయపడ్డారు. అందుకే కొలీజియం సిఫార్సులపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించని పక్షంలో దాన్ని అంగీకారంగానే పరిగణించేలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాలన్నారు.
 

మరిన్ని వార్తలు