ఫేస్‌బుక్‌లో‌ గొడవ.. యువకుడి కాల్చివేత

5 Aug, 2020 18:37 IST|Sakshi

చండీగఢ్‌: పేస్‌బుక్‌లో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చి ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. పంజాబ్‌లోని తరన్‌ తారన్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. కిలా కవి సంతోష్‌ సింగ్‌ గ్రామంలో పరమ్‌జిత్‌ సింగ్‌ అనే వ్యక్తి మెడికల్‌ షాప్‌ నడుపుతున్నాడు. ఈక్రమంలో అతని దుకాణంలో డ్రగ్స్‌ అమ్ముతున్నారని జస్బీర్‌ సింగ్‌ అనే మాజీ సైనికుడు ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నాడు. తాము ఎలాంటి చట్టవ్యతిరేక పనులు చేయడం లేదని, డ్రగ్స్‌ అమ్ముతున్నారంటూ అసత్య ఆరోపణలు చేయొద్దని పరమ్‌జిత్‌ సింగ్‌ కొడుకు సుఖ్‌చైన్‌ సింగ్‌ పలుమార్లు విజ్ఞప్తి చేశాడు.

అయినా, జస్బీర్‌ సింగ్‌ వినిపించుకోలేదు. మంగళవారం వారి దుకాణం వద్దకు చేరుకుని గొడవకు దిగాడు. ఇరు వర్గాలు పరస్పర దూషణలు చేసుకుంటున్న క్రమంలోనే సహనం కోల్పోయిన జస్బీర్‌ సింగ్‌ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో సుఖ్‌చైన్‌ సింగ్‌  (26) తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(ఫేస్‌బుక్‌లో ప్రేమ..)

మరిన్ని వార్తలు