న్యాయవ్యవస్థపై న్యాయ మంత్రి దూకుడు వ్యాఖ్యలు.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన ఫాలీ నారీమన్‌

28 Jan, 2023 18:25 IST|Sakshi

ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్ట‌న్ ఫాలీ నారీమ‌న్.. తాజాగా చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారి తీశాయి.  కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారాయన. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు.

న్యాయమూర్తుల నియామక ప్రక్రియ(కొలీజియం సిఫార్సులు) ఆలస్యమైతే.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లేనని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి నారీమన్‌. కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రం వర్సెస్‌ న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వైరుధ్యం తెలిసిందే.  ఈ క్రమంలో కిరణ్‌ రిజిజు.. న్యాయ వ్యవస్థ అసలు పారదర్శకంగా లేదని, న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కూడా పాత పద్ధతిలోనే (NJAC ద్వారా) కొనసాగాలంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.  అయితే..

ముంబైలో జరిగిన ఓ లా ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. నేరుగా కేంద్ర న్యాయమంత్రిపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. కోర్టు ఇచ్చే తీర్పులు తప్పో ఒప్పో.. ఏవైనా సరే వాటిని అంగీకరించాల్సి ఉంటుందని, మీ విధులకు మీరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని న్యాయశాఖ మంత్రి రిజిజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా సాక్షిగా న్యాయవ్యవస్థను లా మినిస్టర్‌ కిరెన్‌ రిజిజు ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత అవసరం’ అంటూ విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

 ‘‘ఇప్పుడు మీరు విమర్శించొచ్చు. ఒక పౌరుడిగా నేనూ విమర్శించొచ్చు. ఎలాంటి సమస్య లేదు. కానీ, మీరిప్పుడు ఒక యంత్రాంగం అనే విషయం గుర్తుంచుకోండి. కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినా కట్టుబడాల్సిందే.. అంగీకరించాల్సిందే’’ అని పేర్కొన్నారాయన. స్వతంత్రంగా, ఏ మాత్రం బెదరక తీర్పులిచ్చే న్యాయమూర్తులు దేశానికి అవసరమని, వాళ్లు గనుక లేకుంటే న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతుందని, దేశం కొత్త చీకటి యుగంలోకి నెట్టేయబడుతుందని నారీమన్‌ అభిప్రాయపడ్డారు.

పనిలో పనిగా.. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు సైతం ఆయన ఓ సలహా ఇచ్చారు. కొలిజీయం ప్రతిపాదలను నిర్వీర్యం చేసే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని, అసలు  కొలిజీయం సిఫార్సుల మీద కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం 30 రోజుల గడువు విధించాలని, ఆలోపు స్పందన లేకుండా ఆ సిఫార్సులు వాటంతట అవే ఆమోదించబడాలని సుప్రీం కోర్టుకు సూచించారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు ఒకరిద్దరికే అనుకూలంగా వస్తాయన్నారు. కొలీజియం వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని తొలగించాలని చూడకూడదని చెప్పారు.

ఇదిలా ఉంటే మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ ఫాలి నారీమన్‌.. ఆగస్టు 2021లో రిటైర్‌ అయ్యారు. అయితే.. అంతకు ముందు ఆయన కొలీజియం వ్యవస్థలో భాగం పంచుకున్నారు.

మరిన్ని వార్తలు