పెట్రో ఎక్సయిజ్‌ పన్నులతోనే మౌలిక వసతుల అభివృద్ధి

23 Jul, 2021 02:44 IST|Sakshi

న్యూఢిల్లీ:  పెట్రో ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఎక్సయిజ్‌ పన్ను వసూళ్ల మొత్తాలను ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో  చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా సరకు రవాణాపై తీవ్రభారం చూపడంపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో దేశంలోనూ ఎక్సయిజ్‌ పన్ను లీటర్‌కు రూ.19.98 నుంచి రూ.32.9కు పెరిగిందని మంత్రి చెప్పారు.

2020–21లో 13వేల కి.మీ.ల రహదారులు
సగటున రోజుకు 13 కి.మీ.ల చొప్పున 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 13,327 కి.మీ.ల మేర జాతీయ రహదారులను నిర్మించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1,39,032 కి.మీ.ల జాతీయ రహదారుల్లో 37,058 కి.మీ.ల 4/6 లేన్ల జాతీయరహదారుల వ్యవస్థ ఉందని ఆయన పేర్కొన్నారు. 2021–22లో మరో 12 వేల కి.మీ.ల రహదారులను నిర్మిస్తామన్నారు.

మరిన్ని వార్తలు