కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు

2 Jul, 2021 10:39 IST|Sakshi

రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు

పనితీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన

అదనపు బాధ్యతల నుంచి పలువురు మంత్రులకు ఉపశమనం

కేంద్ర కేబినెట్‌లో మరో 28 మందికి చాన్స్‌

న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కసరత్తు సాగిస్తున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ప్రధాని సంకల్పించినట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో గరిష్టంగా 81 మందికి స్థానం ఉంది. ప్రస్తుతం 53 మంది మంత్రులున్నారు. అంటే మరో 28 మందికి అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం నుంచి శర్బానంద సోనోవాల్‌ను కేబినెట్‌లో చేర్చుకోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బిహార్‌ నుంచి లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) చీలిక వర్గం నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడు పశుపతి పరాస్‌ కూడా మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. బిహార్‌లో బీజేపీ మిత్రపక్షం జనతాదళ్‌ యునైటెడ్‌ కూడా కేబినెట్‌లో స్థానం కోసం ఎదురు చూస్తోంది.  ఆ పార్టీ నుంచి లాలన్‌సింగ్, రామ్‌నాథ్‌ ఠాకూర్, సంతోష్‌ కుష్వాహా కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం పోటీ పడుతున్నారు. బిహార్‌ బీజేపీ నేత సుశీల్‌ మోదీ, మహారాష్ట్ర నేత నారాయణ్‌ రాణే, భూపేంద్ర యాదవ్‌ కేబినెట్‌లో చేరనున్నట్లు సమాచారం.
 
ఉత్తరప్రదేశ్‌కు పెద్దపీట 
ఢిల్లీకి దగ్గరి దారి అని భావించే ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ ఢిల్లీ పీఠం దక్కించుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌లో కచ్చితంగా అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే పలువురు యూపీ నేతలకు కేబినెట్‌లో స్థానం కల్పించబోతున్నారు.

పనితీరే ప్రామాణికం 
కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్‌ గడ్కరీ, హర్షవర్దన్, నరేంద్రసింగ్‌ తోమర్, రవి శంకర్‌ ప్రసాద్, స్మృతి ఇరానీ, హరదీప్‌సింగ్‌ పురి అదనపు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి వారికి పనిభారం తగ్గించనున్నారు. మంత్రివర్గం నుంచి ఎవరెవరిని తొలగించాలన్న దానిపై ఇప్పటికే ప్రధాని మోదీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారంగా పలువురికి ఉద్వాసన తప్పదంటున్నారు.

చదవండి: స్పుత్నిక్‌ లైట్‌కి నో

>
మరిన్ని వార్తలు