Sonali Phogat Murder Case: సోనాలీ ఫోగట్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. డైరీలో వారి పేర్లు!

5 Sep, 2022 21:15 IST|Sakshi

Sonali Phogat.. బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగట్‌ మృతి ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఆమెకు డ్రగ్స్‌ ఇచ్చి చంపేసినట్టుగా సోనాలీ ఫోగట్‌ మృతి కేసులో నిందితుడు సుధీర్‌ సంగ్వాన్‌ను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా ఆమెకు సంబంధించిన వస్తువులు మిస్‌ అవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోనాలీ ఫోగట్‌ ఫాంహౌస్ నుంచి ఖ‌రీదైన కార్లు, ఫ‌ర్నిచ‌ర్ అదృశ్య‌మైన‌ట్టు తెలిసింది. హ‌త్య కేసును ద‌ర్యాప్తు చేసిన గోవా పోలీసులు ఫాంహౌస్‌లో విలువైన ఆస్తులు మాయం కావ‌డం గుర్తించారు. దీంతో, మిస్‌ అయిన వస్తువులు, వాహనాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. 

మరోవైపు.. సోనాలీ ఫోగట్‌ ఆస్తిని చేజిక్కించుకోవాల‌ని సుధీర్ సంగ్వాన్ ఎప్ప‌టినుంచో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడ‌ని దర్యాప్తు సమయంలో తేలినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఆమె.. ఫాంహౌస్ విలువ రూ. 110 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఏటా రూ. 60వేలు చెల్లించి 20 ఏళ్ల పాటు ఫాంహౌస్‌ను లీజుకు తీసుకోవాల‌ని సంగ్వాన్ స్కెచ్ వేశాడ‌ని పోలీసులు వెల్లడించారు. కాగా, ఆమె హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు సోనాలీ డైరీ దొరికింది. ఇక, ఆ డైరీలో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నెంబ‌ర్లు ఉన్నట్టు తెలిపారు. అయితే, వారి పేర్లు మాత్రం పోలీసులు బయటకు చెప్పలేదు. అలాగే ఓ పాస్‌పోర్టు, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు