Corona vaccine: అందుబాటులోకి మరో వ్యాక్సిన్‌,12 ఏళ్లు దాటిన వారికి కూడా

20 Aug, 2021 19:49 IST|Sakshi

మరో వ్యాక్సిన్‌కు డ్రగ్ ప్యానెల్ అనుమతి

3 డోసులు జైకోవ్-డి వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం

12 ఏళ్లు దాటిన వారికి జైకోవ్‌-డి టీకా

జైకోవ్-డి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన జైడస్‌ క్యాడిల్లా

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మూడో దశ రానుందన్న అందోళనల నేపథ్యంలో అయిదో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. జైడస్ కాడిల్లాకు చెందిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రభుత్వ డ్రగ్‌ ప్యానెల్‌ అనుతిమినిచ్చింది.  సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ఓ) సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసి) జైడస్ మూడు డోసుల వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది.  తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసింది. దీనికి డీజీసీఐ కూడా అనుతినివ్వడంతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండవ దేశీ వ్యాక్సిన్‌గా  జైకోవ్‌-డీ నిలవనుంది. అంతేకాదు దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా  కూడా ఇదే.

అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా జైకోవ్-డి పేరుతో ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. (మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్​, 45 రోజుల తర్వాత మూడో డోస్​) వ్యాక్సిన్​. సూది లేకుండా ఇంట్రాడెర్మల్​ ప్లాస్మిడ్​ డీఎన్​రే టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని, అలాగే సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా తక్కేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 12 ఏళ్ల వారికి కూడా వినియోగించేలా భారీగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ ఏజ్‌ గ్రూపు వారికి ట్రయల్స్‌ చేసిన ఏకైక వ్యాక్సిన్‌ జైకోవ్‌-డి కావడం విశేషం.  

కాగా కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్-వీ, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్-డోస్ వ్యాక్సిన్ వంటి ఐదు టీకాలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. కోవాక్సిన్‌ తరువాత జైకోవి-డీ దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్. జైడస్ కాడిల్లా ఏటా 120 మిలియన్ డోస్‌లను తయారు చేయాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు