రిజర్వేషన్లు: 50% పరిమితి ఎలా వచ్చింది?

6 May, 2021 12:58 IST|Sakshi

న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్‌ వేసిన విషయం తెలిసిందే. మరాఠా సామాజిక వర్గానికి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. దీంతో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది.

50% పరిమితి ఎలా వచ్చింది?
1979లో నాటి జనతా ప్రభుత్వం బిహార్‌కు చెందిన ఎంపీ బీపీ మండల్‌ నేతృత్వంలో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1980లో ఆ కమిషన్‌ నివేదిక వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాలకు 27%.. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు 22.5%, మొత్తంగా 49.5% రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్‌ సిఫారసు చేసింది. దాదాపు దశాబ్దం అనంతరం ఈ కమిటీ సిఫారసులను అమలు చేస్తూ, ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

దీనిపై ఇందిర సాహ్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవకాశాల్లో అందరికీ సమానత్వం కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హామీ ఉల్లంఘనకు గురైందని వాదించారు. వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవద్దన్నారు. రిజర్వేషన్లతో ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. దాంతో, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. అనంతరం విచారణ కొనసాగింది. ఆ తరువాత, 1992 నవంబర్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను సమర్ధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

వెనుకబాటుతనాన్ని గుర్తించే ఉపకరణంగా కులాన్ని పరిగణించడాన్ని కోర్టు సమర్థించింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల హక్కులకు పరిమితి ఏర్పడింది. రిజర్వేషన్లు 50% పరిమితికి కచ్చితంగా లోబడే ఉండాలని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఓబీసీల్లోని సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించినవారు ఈ రిజర్వేషన్లకు అనర్హులని పేర్కొంది. అయితే, రిజర్వేషన్ల పరిమితి 50 శాతమే ఎందుకన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు 11 ఇండికేటర్లను తీర్పులో పేర్కొంది. దేశంలో వెనుకబడిన వర్గాల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, వారికి కల్పించిన 27% రిజర్వేషన్లు తక్కువేనన్న వాదన ఈ తీర్పు అనంతరం తెరపైకి వచ్చింది. నిజానికి, రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సహకరించే ప్రత్యేక నిబంధనలను రాష్ట్రాలు రూపొందించే ప్రక్రియను అడ్డుకునే అంశాలేవీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 లేదా ఆర్టికల్‌ 29 క్లాజ్‌ 2లో కానీ లేవు’అని పేర్కొన్నారు.

చదవండి: Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్‌ చెల్లదు

మరిన్ని వార్తలు