వైద్య పీజీ సీట్ల భర్తీకి గడువు పొడిగింపు

31 Jul, 2020 03:04 IST|Sakshi

అర్హత నిబంధనల సడలింపులపై ఎంసీఐ, ఎన్‌ఈబీకి నివేదించండి

వైద్య కళాశాలల సంఘం పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ కోసం ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్త ర్వులు జారీ చేసింది. కనీస అర్హత నిబంధనల సడలింపులపై భారత వైద్య మండలి (ఎంసీఐ), నేషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (ఎన్‌ఈబీ)కి నివేదించుకోవాలని పేర్కొంది. కరోనా కారణంగా వైద్య విద్య పీజీ కోర్సుల్లో సీట్లు భర్తీ కాకపోవడంతో అర్హత నిబంధనలు సడలించి మిగిలిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని, భర్తీకి గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కళాశాల యాజమాన్యాల సంఘం తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

గురువారం జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీనారీమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, అల్లంకి రమేశ్‌ వాదనలు వినిపించారు. 2020–21 విద్యా సంవత్సరానికి వైద్య విద్యకు సంబంధించి పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు కనీస అర్హత నిబంధనలు సడలించాలని, నీట్‌ పీజీ కటాఫ్‌ మార్కులు తగ్గించడంగానీ, కనీస మార్కుల అర్హత నిబంధన తొలగించడంగానీ చేయా లని కోరారు. కాంపిటెంట్‌ అథారిటీ, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో సీట్లు భర్తీ కానందున గడువు పొడిగించాలని కోరారు.

ఈ నేపథ్యంలో ధర్మాసనం ప్రస్తుత విద్యాసంవత్సరం సీట్ల భర్తీ గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కనీస అర్హత నిబంధనలైన నీట్‌ ఉత్తీర్ణత వంటి నిబంధనలను సడలించేందుకు అధీకృత సంస్థలైన ఎంసీఐ, ఎన్‌ఈబీకి అధికారం ఉందని పిటిషనర్‌ తరపున న్యాయవాది చేసి న వ్యాఖ్యలతో ఏకీభవించిన ధర్మాసనం..   తగిన ఉత్తర్వుల కోసం ఆయా సంస్థలను సంప్రదించొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. 

అన్ని రాష్ట్రాలకు ఆగస్టు 31 వరకు.. 
ఇదే రకమైన అభ్యర్థనతో బిహార్‌ కళాశాలలు, రాజస్తాన్‌ ప్రభుత్వం కూడా అభ్యర్థన దాఖలు చేశాయి. ఆయా కేసుల్లో వెలువడిన ఉత్తర్వులు, తెలంగాణ కేసులో వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో భర్తీకి గడువును ఆగస్టు నెలాఖరుకు పొడిగిస్తూ ఎంసీఐ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ ఆర్‌.కె.వత్స్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు