ఫేస్‌బుక్‌ సాయం, పోలీసుల కృషి ప్రాణాలు కాపాడింది

10 Aug, 2020 08:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌ సాయం, పోలీసుల కృషి 27 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడాయి. కొద్ది క్షణాల్లో ఆత్మహత్యకు పాల్పడబోతున్న వ్యక్తిని రెండు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా కృషి చేసి పట్టుకొని అతని ఆత్మహత్య ఆలోచనను చంపేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ 27 వ్యక్తి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఫేస్‌బుక్‌ సిబ్బంది ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ అన్యేష్ రాయ్‌కి మెయిల్‌ ద్వారా తెలియజేసింది. రాత్రి 8గంటల ప్రాంతంలో మెయిల్‌ రావడంతో అప్రమత్తమైన డీసీపీ... ఫోన్‌ నెంబర్‌ను ట్రేస్‌ చేసి అడ్రస్‌ కనుకున్నారు.
(చదవండి : తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య; అల్లుడి అరెస్ట్‌)

అయితే అక్కడ మరో ట్విస్ట్‌ ఎదురైంది. ఆ నెంబర్‌ తన భర్తది అని ఓ మహిళ తెలియజేసింది. తనతో గొడవపడి భర్తతో ఎక్కడికో వెళ్లాడని, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని ఆమె చెప్పింది. ఆయన నెంబర్‌ను తాను వినియోగిస్తున్నానని, అతనికి మరో నెంబర్‌ ఉందని అది వారికి ఇచ్చింది. గతంలో ఆయన ముంబైలోని ఓ చిన్న హోటల్‌లో కుక్‌గా పనిచేసేవాడని పేర్కొంది. దీంతో ఢిల్లీ డీసీపీ వెంటనే ముంబై డీసీపీ రష్మి కరాండికర్‌ను సంప్రదించారు. కొత్త ఫోన్‌ నెంబర్‌ను వారికి ఇచ్చి ట్రేస్‌ చేయాలని కోరారు. ముంబై పోలీసులు ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయగా.. కలవలేదు. వెంటనే ముంబై పోలీసులు అతని తల్లిని సంప్రదించారు. ఆమెకు వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్‌ చేసినట్లు గుర్తించి ఆ నెంబర్‌ను ట్రేస్‌ చేశారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ముంబై పోలీసులు అతని అడ్రస్‌ కనుగొన్నారు. అతన్ని ఫోన్‌ చేసి మాటల్లో పెట్టిన ముంబై  పోలీసులు.. లోకేషన్‌ ట్రేస్‌ చేసి అతన్ని పట్టుకున్నారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. 
 

మరిన్ని వార్తలు