పార్లమెంటరీ ప్యానెల్‌ ముందుకు అజిత్‌ మోహన్‌

3 Sep, 2020 03:47 IST|Sakshi

సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై చర్చలు

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీసిన  నేపథ్యంలో ఆ కంపెనీ భారత్‌ చీఫ్‌  అజిత్‌ మోహన్‌ బుధవారం పార్లమెంటరీ ప్యానెల్‌ ఎదుట హాజరయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ ఆధ్వర్యంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఫేస్‌బుక్‌ ప్రతిని«ధుల్ని కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం, పౌర హక్కుల పరిరక్షణ, డిజిటల్‌ మీడియాలో మహిళా భద్రత అనే అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగినట్టు అధికారులు వెల్లడించారు. ఫేస్‌బుక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మోహన్‌ రెండు గంటలపైగా ప్యానెల్‌తో చర్చించారు. దాదాపు 90 ప్రశ్నలను ఆయనకు అందజేసిన ప్యానల్‌ వీటికి లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని కోరింది. ఇదే అంశంపై చర్చించడానికి ప్యానెల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతినిధుల్ని కూడా పిలిచింది. ప్యానెల్‌ చైర్మన్‌ థరూర్‌ సహా 18 మంది సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఫేస్‌బుక్‌లో బీజేపీ సభ్యుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్టుగా వదిలేస్తోందని, ఆ పార్టీపై పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపణలు చేస్తూ ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ అంశంపై కూడా చర్చించాలని ప్యానెల్‌ చైర్మన్‌ శశి థరూర్‌  పట్టుబట్టగా, ప్యానెల్‌లోని బీజేపీ ప్రతినిధులు ఆయనని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటరీ ప్యానెల్‌ని శశిథరూర్‌ తన సొంత రాజకీయ ఎజెండాకి వాడుకోవడం ఎంత వరకు కరెక్టని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ప్రశ్నించారు. మరోవైపు బీజేపీకి కొమ్ము కాసేలా ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తోందని, దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆ సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ లేఖ రాసింది.

మరిన్ని వార్తలు