వ్యాక్సిన్లపై ఆ ప్రచారాలు, నిజమెంతంటే..

17 Jun, 2021 11:47 IST|Sakshi

వ్యాక్సిన్‌లు తప్ప మరో సురక్షిత మార్గం ఇప్పుడు మన ముందు లేదని వైద్య నిపుణులు, సైంటిస్టులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోపక్క వ్యాక్సిన్‌లపై ఉత్త ప్రచారాలతో కొందరు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలు, కేంద్ర ఆరోగ్య శాఖ సౌజన్యంతో ఆ ఉత్త ప్రచారాలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా.. వ్యాక్సిన్‌ డోసులు తీసుకున్న వాళ్లు ఆపరేషన్లకు దూరంగా ఉండాలని, కోవాగ్జిన్‌లో ఆవు దూడ సీరం ఉంటుందనే ప్రచారాలతో సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

కరోనా వాక్సిన్‌లు తీసుకున్న వాళ్లు.. ఆపరేషన్లకు దూరంగా ఉండాలని, ఎందుకంటే ఆపరేషన్‌కి ముందు ఇచ్చే అనస్తీషియా డ్రగ్స్‌ వల్ల వ్యాక్సిన్‌ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది ప్రాణాలకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్‌ తీసుకున్నవాళ్లకు అనస్థీషియా ముప్పు ఎక్కువగా ఉందనేది ఆ వార్త ప్రధాన సారాంశం. అయితే ఈ ప్రచారానికి ఎలాంటి సైంటిఫిక్‌ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు. సర్జరీల టైంలో స్పృహ కోల్పోవడానికి మాత్రమే జనరల్‌ అనెస్థెషీయా ఇస్తారు. అనస్థటిక్‌ డ్రగ్స్‌ వల్ల మత్తు, శరీరం.. ప్రత్యేకించి ఆపరేషన్‌ జరిపే భాగం మొద్దుబారిపోతుందే తప్ప శరీరానికి ఎలాంటి హాని చేయబోదని వెల్లడించారు.

‘‘వ్యాక్సిన్‌ తీసుకున్నవాళ్లలో కొందరికి ఇమ్యూనిటీ పవర్‌ తక్కువగా ఉండొచ్చు. ఆ ప్రభావంతో వాళ్లు నీరసించిపోవచ్చు. అలాంటి పేషెంట్లకు రిస్క్‌ రేటు ఉంటుంది. కాబట్టే ఆ టైంలో ఆపరేషన్లకు వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నాం. అంతేకాదు వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లకు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైతే ఆపరేషన్లు తప్పవు. అలాగే అనస్తీషియా డ్రగ్స్‌తో వచ్చిన ముప్పేమి ఉండదు. ఇప్పటివరకు అలాంటి కేసులేవీ దృష్టికి రాలేదు, అసలు ఈ అంశంపై అధ్యయనాలు ఇంకా మొదలుకాలేద’ని అనస్థీషియా నిపుణులు స్పష్టం చేశారు.    

దూడ సీరం
ఇక దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌పై వ్యతిరేక ప్రచారం రకరకాలుగా ఉంటోంది. టీకా తయారీలో అప్పుడే పుట్టిన లేగ దూడల సీరం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లలో అసలు విషయాల్ని కాకుండా.. తప్పుడు సమాచారాన్ని వైరల్‌ చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అప్పుడే పుట్టిన దూడ సీరంను వేరో కణాల (vero cells) తయారీకి, వాటి పెరుగుదలకు మాత్రమే ఉపయోగిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ‘వివిధ రకాల బోవిన్ (ఆవు, గేదె), ఇతర జంతువుల సీరంను వేరో కణాల పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీకి ఇదొక ప్రామాణిక పదార్థం. టీకాల ఉత్పత్తిలో ఈ వేరో కణాల్ని ఉపయోగిస్తారు.

కొత్తదేం కాదు
అయితే వీరో కణాల్ని ప్రత్యేక పరిస్థితుల్లో శుద్ధి చేసిన తర్వాతే వ్యాక్సిన్‌ల తయారీకి ఉపయోగిస్తారు. అప్పుడు దూడ సీరం ఆనవాళ్లు పూర్తిగా తొలగిపోతాయి. అంటే అంతిమ దశలో అసలు సీరం ఆనవాళ్లు ఉండవన్నమాట. కొన్ని సంవత్సరాలుగా.. పోలియో, రేబిస్, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ల తయారీలో.. ఇప్పుడు కరోనా వైరస్‌ తయారీలోనూ ఈ పద్ధతిని కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్తలను, వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా, అందరూ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ఈ మేరకు సమాచార హక్కుచట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కు.. క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ.

చదవండి: వ్యాక్సిన్‌లు బాబూ.. వ్యాక్సిన్‌లు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు