Fact Check: ఏప్రిల్‌ మొదటి వారంలో ఢిల్లీలో భారీ భూకంపం?

29 Mar, 2023 21:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర ‍భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మార్చి 21న అఫ్గనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 187 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. దీంతో ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌, హర్యానా, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 6.5 గా నమోదైంది. భూకంపం దాటికి ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురై. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే తాజాగా ఏప్రిల్‌ మొదటి వారంలో ఢిల్లీలో మరోసారి భారీ భూకంపం రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో దేశ రాజధానిలో రిక్టర్‌ స్కేల్‌పై 9.8 తీవ్రతతో భూకంపం సంభవించనున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని జాతీయ మీడియా సంస్థ (timesnow) ఫ్యాక్ట్‌ చెక్‌ చేయగా వీటిని అసత్య ప్రచారాలుగా తేల్చింది. ఏప్రిల్‌లో ఢిల్లీలో భూకంపం చోటు చేసుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని..  అదంతా ఫేక్‌ అని స్పష్టం చేసింది.

ఇదిలాఉండగా.. మార్చి 21న ఢిల్లీతోపాటు  పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో  భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా నమోదైంది. భూకంపం ధాటికి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, కొండచరియలు విరిగిపడ్డాయి. పాక్‌లో భూకంపం ధాటికి ఇద్దరు మహిళలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్‌ ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు. 
చదవండి: చీరకట్టులో ఫుట్‌బాల్ ఇరగదీసిన మహిళలు.. వీడియో వైరల్..


 

మరిన్ని వార్తలు