బ్లాక్​ఫంగస్ దానివల్ల రాదు​.. ఇది అసలు విషయం!

30 May, 2021 09:14 IST|Sakshi

ఆదివారం వచ్చింది. ముక్క నోట్లోకి పోనిద్దాం అని ఆశతో చాలామంది పొద్దున్నే సంచులతో బయలుదేరుతారు. ఇంతలో  ‘కోళ్లకు బ్లాక్​ ఫంగస్​.. తస్మాత్​ జాగ్రత్త!’ అని ఎక్కడో వాట్సాప్​లోనో, ఎవరో చెప్పడంతోనే ఆలోచనల్లో పడతారు. కానీ, చికెన్​తో ఆ భయం అక్కర్లేదని డాక్టర్లు, సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. ఇంతకీ వాట్సాప్​లో వైరల్ అవుతున్న ఆ వార్త వెనుక అసలు విషయం ఏంటో చూద్దాం. 

న్యూఢిల్లీ: కరోనాతో పాటు బ్లాక్​ ఫంగస్ దేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, కొన్ని రోజుల పాటు చికెన్​కి దూరంగా ఉండడమే మంచిదని వాట్సాప్​ల్లో ఈమధ్య వైరల్ అవుతోంది. దీనికి తోడు ఓ ప్రముఖ న్యూస్​ వెబ్​సైట్ పేరు మీద అది పబ్లిష్ కావడం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయని కథనాలు వైరల్ అవుతుండడంతో చాలామంది నమ్మేస్తున్నారు.

అయితే వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్​ ఫంగస్​..  కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్​ ద్వారా మనుషులకు బ్లాక్​ఫంగస్​ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) సీనియర్​ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ చెప్తున్నారు. అసలు బ్లాక్​ ఫంగస్​ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె స్ఫస్టత ఇచ్చారు. కాబట్టి చికెన్​కి భయపడాల్సిన అవసరం లేదని ఆమె అంటున్నారు. 

వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్​ఫంగస్​ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్య‌మాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్​లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్​ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్​లు స‌ర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్​ వల్ల వస్తుంది. కట్​ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది. ఇక ఈ కరోనా టైంలో వైరస్​ నుంచి వ్యాక్సిస్​ దాకా.. వేరియెంట్ల నుంచి ట్రీట్​మెంట్​ దాకా అన్నింటి గురించి వాట్సాప్​లో పుకార్లు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు చెప్తున్నారు.

కోళ్లకు సోకినా..
అయితే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్​ సోకినట్లు గుర్తించవచ్చని ఐసీఎఆర్​ సైంటిస్ట్​ డాక్టర్ ఎంఆర్ రెడ్డి చెప్తున్నారు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినలేరు కదా. అయితే ఇప్పటివరకు జంతువులకు బ్లాక్​ఫంగస్​ సోకిన కేసులు నిర్ధారణ కాలేదని, దానిపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని ఎంఆర్​రెడ్డి చెప్తున్నారు. అయితే కోళ్లను, బాతులను ముద్దు చేయడం ద్వారా సాల్మొనెల్లా ఇన్​ఫెక్షన్​ సోకుతుందని, ఇది సాధారణమైన ఇన్​ఫెక్షన్​ కలుగజేస్తుందని అన్నారు. 

అంటువ్యాధి కాదు
బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని ఎయిమ్స్​ డైరెక్టర్​, పల్మనాలజిస్ట్​ అయిన రణ్దీ​ప్​ గులేరియా ఇది వరకే స్పష్టం చేశారు. మ్యూకర్ అనే ఫంగస్ కారణంగా ఈ మ్యుకర్మైకోసెస్ వస్తుందని చెబుతూనే.. అపోహలపై క్లారిటీ ఇచ్చారాయన. ఇక యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. ఈ వైరస్ కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఇమ్యూనిటి ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌టం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్​ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు