అయోధ్య: ‌5 ఎక‌రాల్లో బాబ్రీ ఆస్ప‌త్రి?

9 Aug, 2020 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో నానుతూ వ‌చ్చిన అయోధ్య వివాదాస్ప‌ద స్థ‌లం(2.77 ఎకరాలు) రాముడిదేన‌ని సుప్రీం కోర్టు గ‌తేడాది సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించిన విష‌యం తెలిసిందే. అయితే అయోధ్య‌లోనే మ‌సీదు నిర్మాణానికి గానూ ముస్లింల‌కు (సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు) ఐదు ఎక‌రాల స్థ‌లం కేటాయించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం కూడా సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు భూమి కేటాయించింది. దీంతో రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు వేగ‌వంత‌మ‌వుతున్నాయి. అందులో భాగంగా ఆగ‌స్టు 5న అయోధ్య‌లో భూమి పూజ కూడా జ‌రిగింది. ఈ క్ర‌మంలో అయోధ్య‌లో సున్నీ వ‌క్ఫ్ బోర్డు త‌మ‌కు కేటాయించిన భూమిలో బాబ్రీ ఆస్ప‌త్రి క‌డుతోందంటూ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. (ఆ భూమి తీసుకుంటాం: సున్నీ వక్ఫ్‌బోర్డు)

ఎయిమ్స్ త‌ర‌హాలో నిర్మించ‌నున్న‌ ఈ ఆసుప‌త్రికి ప్ర‌ముఖ వైద్యుడు డా. క‌ఫీల్ ఖాన్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌‌రిస్తార‌‌న్న‌ది స‌ద‌రు పోస్టుల సారాంశం. ఆ ఆసుపత్రి ఎలా ఉండ‌బోతుందో తెలిపేందుకు న‌మూనా ఫొటోల‌ను కూడా జ‌త చేశారు. ఇదంతా నిజ‌మేన‌ని భ్ర‌మ ప‌డిన ముస్లిం వ్య‌క్తులు ఈ సందేశం అంద‌రికీ చేరాల‌ని విప‌రీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వైర‌ల్ వార్త‌పై స్పందించిన సున్నీ వ‌క్ఫ్ బోర్డు ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని తేల్చి చెప్పింది. త‌మ‌కు కేటాయించిన 5 ఎక‌రాల్లో ఏం నిర్మించాల‌నే విష‌యంపై ఇంకా నిర్ధార‌ణకు రాలేమ‌ని స్ప‌ష్టం చేసింది. (రామ మందిరానికి షారుక్ రూ.5 కోట్ల విరాళం?)

నిజం: అయోధ్య‌లో సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు కేటాయించిన ఐదు ఎక‌రాల్లో బాబ్రీ ఆస్ప‌త్రి క‌ట్ట‌డం లేదు.

మరిన్ని వార్తలు