Fact Check: ఇది నిజంగా ముంబైలో జరిగిందా?

18 May, 2021 13:11 IST|Sakshi

ముంబై: అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపానుగా రూపం దాల్చినటౌటేమహారాష్ట్ర, గుజరాత్‌లో పెను విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ముంబై, థానెల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను వణికించాయి. ఈ క్రమంలో వరద బీభత్సానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇక ముంబైలోని ట్రిడెంట్‌ హోటల్‌ ముందు పార్కు చేసిన కార్లపై పైకప్పు ఒక్కసారిగా కూలిపోయినట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు తుపాను తీవ్రతను తెలియజేస్తున్నాయంటూ కొంత మంది నెటిజన్లు ఓ వీడియోను షేర్‌ చేస్తున్నారు. అయితే, ఇది టూటే తుపానుకు సంబంధించినది కాదని, 2020 నాటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయని ఆలిండియా రేడియో న్యూస్‌ ముంబై స్పష్టం చేసింది. రివర్స్‌ ఇమేజ్‌ టెక్నిక్‌తో సర్చ్‌ చేసి చూడగా, పాత వీడియో అని  తేలినట్లు పేర్కొంది.

ఇందుకు రుజువుగా, ట్రిడెంట్‌ హోటల్‌ ముందున్న ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టే దృశ్యాలను జత చేసింది. ఇక తాము వైరల్‌ చేస్తున్నది పాత వీడియో అని తెలియడంతో నెటిజన్లు నాలుక్కరచుకుంటున్నారు. మరికొంత మందేమో.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు మరింత బెంబేలెత్తిపోయేలా చేయవద్దంటూ హితవు పలుకుతున్నారు.

వాస్తవం: వైరల్‌ వీడియో ముంబైకి సంబంధించినది కాదు. 2020లో సౌదీ అరేబియాలో జరిగిన ఘటనకు సంబంధించింది.
చదవండి: Cyclone Tauktae: తీరం దాటిన ‘టౌటే’

మరిన్ని వార్తలు