మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా?

30 Aug, 2022 08:42 IST|Sakshi

కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో చర్చనీయాంశం

నూతన ప్రభుత్వ ఏర్పాటు అనంతరం బీజేపీకి దగ్గరవుతున్న ఎమ్మెన్నెస్‌

ముంబై, పుణే, థానే, నాసిక్‌ కార్పొరేషన్లలో రాజ్‌ పార్టీకి పట్టు

ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌ బలాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్న బీజేపీ

సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే సోమవారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అధికార నివాసమైన సాగర్‌ బంగ్లాలో భేటీ అయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఇరువురి భేటీవల్ల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చినట్లయింది. త్వరలో ముంబై, థానే, పుణే, నాసిక్‌ తదితర ప్రధాన కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 అక్టోబరులో ముఖ్యమంత్రి పీఠంపై శివసేన, బీజేపీ మధ్య నెలకొన్న వివాదం చివరకు తెగతెంపులు చేసుకునే వరకు దారి తీసిన విషయం తెలిసిందే.

శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత అప్పటి నుంచి బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య సాన్నిహిత్యం కొంతమేర పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్మెన్నెస్‌కు ముంబై, థానే, నాసిక్, పుణే కార్పొరేషన్లలో మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీ, ఎమ్మెన్నెస్‌ మధ్య పొత్తు కుదురుతుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ శిందే వర్గం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్‌ మద్దతు కూడా లభిస్తే ఆ నాలుగు కార్పొరేషన్లలో విజయం సులభం కానుంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.  

బీజేపీకి దగ్గరవుతున్న ఎమ్మెన్నెస్‌ 
ఇదిలాఉండగా బీజేపీ శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్‌ ఠాక్రే మధ్య సంబంధాలు కొంత బలపడ్డట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజ్‌ ఠాక్రే ఓ లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినందుకు ఫడ్నవీస్‌ను ప్రశంసించారు. అనంతరం రాజ్‌ ఠాక్రే నివాసమైన శివ్‌ తీర్ధ్‌ బంగ్లాకు వెళ్లి ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు.

అదేవిధంగా రాజ్‌ ఠాక్రే మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఆందోళనకు బీజేపీ నుంచి ప్రశంసల జల్లులు కురిశాయి. అప్పుడే హిందుత్వ నినాదంపై బీజేపీ, ఎమ్మెన్నెస్‌ ఒక్కటవుతుండవచ్చని వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సాన్నిహిత్యం, ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం రాజ్‌ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోమవారం జరిగిన భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా...లేక రాజకీయ పరంగా జరిగిందా.. అనేది త్వరలో బయటపడనుంది.  

చదవండి: (చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా)

ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలు
త్వరలో ముంబై, థానే సహా పుణే, పింప్రి–చించ్‌వడ్, ఉల్లాస్‌నగర్, భివండీ, పన్వేల్, మీరా–భాయందర్, షోలాపూర్, నాసిక్, మాలేగావ్, పర్భణీ, నాందేడ్, లాతూర్, అమరావతి, అకోలా, నాగ్‌పూర్, చంద్రాపూర్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్‌ కారణంగా తరుచూ ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాని ఈ ఎన్నికల్లో తమ బలం, సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు నడుం బిగించాయి.

ఇటీవల ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. దీంతో అధికార పార్టీతో పాటు, ప్రతిక్షాలు కూడా ఈ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలకుపైగా ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఏలాంటి అద్భుతం జరుగుతుంది..? ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై యావత్‌ రాష్ట్ర ప్రజల దృష్టి ఇటువైపు ఉంది.  

మరిన్ని వార్తలు