ఆన్‌లైన్‌ మీటింగ్‌.. ఇక నో చీటింగ్‌!

21 May, 2021 19:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అనుమతి లేని హాజరు పట్టేయచ్చు

వర్చువల్‌ సమావేశాలకు ‘ఫేక్‌ బస్టర్‌’ 

అభివృద్ధి చేసిన ఐఐటీ రోపర్, మోనాష్‌ వర్సిటీ  

సాక్షి, న్యూఢిల్లీ: వర్చువల్‌ సమావేశాలకు అనుమతి లేకుండా రహస్యంగా హాజరయ్యే వారిని గుర్తించొచ్చని పంజాబ్‌లోని రోపర్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ అభినవ్‌ ధాల్‌ తెలిపారు. ‘ఫేక్‌బస్టర్‌’ అనే ప్రత్యేకమైన డిటెక్టర్‌ను రోపర్‌ ఐఐటీ, ఆస్ట్రేలియాలోని మోనాష్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎవరినైనా అపఖ్యాతిపాలు చేయడానికి లేదా ఎగతాళి చేయడానికి సోషల్‌ మీడియాలో నకిలీ ముఖాలతో పోస్టులు పెట్టినా కూడా కనుగొనవచ్చు.

ప్రస్తుతం మహమ్మారి కారణంగా, అధికారిక సమావేశాలు చాలావరకు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్‌ సమయంలో ఒకరిస్థానంలో వేరే వాళ్లు పాల్గొన్నా లేదా అక్రమంగా ఉపయోగించుకున్నా సమావేశ నిర్వాహకుడికి ఈ డిటెక్టర్‌ సాయంతో తెలిసిపోతుంది. ఉదాహరణకు మోసగాడు మీ సహోద్యోగులలో ఒకరి తరపున వెబ్‌నార్‌ లేదా వర్చువల్‌ సమావేశానికి హాజరైతే ఈ టూల్‌ ద్వారా అతణ్ని గుర్తించవచ్చు.

‘‘అధునాతన కృత్రిమ మేధస్సు పద్ధతుల వల్ల సోషల్‌ మీడియాలో ఎన్నో అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. ఇటువంటివి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. మరింత వాస్తవికంగా మారతాయి. ఇలాంటి మోసాలను గుర్తించకపోతే కష్టమే. మోసగాళ్ల వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయి’’ అని ఫేక్‌బస్టర్‌ను అభివృద్ధి చేసిన నలుగురు వ్యక్తుల బృందంలో ఒకరైన ప్రొఫెసర్‌ అభినవ్‌ ధాల్‌ తెలిపారు. ఈ పరికరం 90 శాతానికి పైగా కచ్చితత్వాన్ని సాధించిందన్నారు.  మిగతా ముగ్గురు సభ్యుల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రామనాథన్‌ సుబ్రమణియన్‌ , ఇద్దరు విద్యార్థులు వినీత్‌ మెహతా, పారుల్‌ గుప్తా ఉన్నారు.


గత నెలలో అమెరికాలో ఇంటెలిజెంట్‌ యూజర్‌ ఇంటర్‌ఫేసెస్‌పై నిర్వహించిన 26వ అంతర్జాతీయ సమావేశంలో ‘‘ఫేక్‌ బస్టర్‌: ఏ డీప్‌ ఫేక్స్‌ డిటెక్షన్‌ టూల్‌ ఫర్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ సినారియోస్‌’’ అనే పత్రాన్ని సమర్పించారు. నకిలీ వార్తలు, అశ్లీలత, ఇతర ఆన్‌లైన్‌ విషయాలను వ్యాప్తి చేయడానికి తారుమారు చేసిన మీడియా కంటెంట్‌ను విస్తృతంగా వాడినట్టు గుర్తించామని ప్రొఫెసర్‌ ధాల్‌ తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని అన్నారు.

ముఖ కవళికలను మార్చగల స్పూఫింగ్‌ టూల్స్‌ ద్వారా  మోసగాళ్లు ద్వారా వీడియో–కాలింగ్‌ సమావేశాల్లోకి చొరబడ్డారని ఆయన అన్నారు. ఈ నకిలీ ముఖ కవళికలను గుర్తించడం కష్టమేనని, ఆ వ్యక్తి నిజమైన వారే అనుకుంటామని పేర్కొన్నారు. ఫలితంగా తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయన్నారు.

ఇవి కూడా చదవండి:
డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్

YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి!

మరిన్ని వార్తలు