Yesudasan: ప్రముఖ కార్టూనిస్ట్‌ కన్నుమూత, సీఎం సంతాపం

6 Oct, 2021 13:31 IST|Sakshi

తిరువనంతపురం :  ప్రముఖ కార్టూనిస్ట్‌, కేరళ కార్టూన్‌ అకాడమీ చైర్మన్‌ సీజే  ఏసుదాసన్‌ (83)  బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  కానీ పోస్ట్‌ కరోనా సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో  తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు.  ఆయన అంత్యక్రియలు రేపు జరగ నున్నాయని, ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం కలమస్సేరి, మున్సిపల్ టౌన్ హాల్‌లో ఉంచుతామని తెలిపారు.

ఏసుదాసన్‌ అకాలమరణంపై  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  సంతాపం తెలిపారు. కార్టూన్ల రంగం ప్రతిభావంతుడైన ఆర్టిస్టును కోల్పోయిందంటూ నివాళులర్పించారు. ఏసుదాసన్  తన కార్టూన్ల ద్వారా, ఒక కాలంలోని రాజకీయ పరిణామాలను ప్రతిబింబించడమే కాకుండా, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం పరిచేవారని, ఆయన పనిని పరిశీలించే ఎవరైనా కేరళ రాజకీయ చరిత్రను చూడొచ్చని సీఎం అన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, వీడీ సతీసన్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ఇంకా సీనియర్‌ కార్టూనిస్టులు, పలువురు జర్నలిస్టులు  కూడా ఏసుదాసన్‌ మృతికి సంతాపం తెలిపారు.  కేరళ కార్టూన్‌ అకాడమీకి ఏసుదాసన్‌ తొలి చైర్మన్‌ మృతికి కొచ్చిలోని సీనియర్‌ జర్నలిస్ట్‌  యూనియన్‌ సంతాపం ప్రకటించింది. ఏసుదాసన్‌ ఎంతో సౌమ్యమైన వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని గౌరవించేవారని ఢిల్లీలోని ప్రముఖ కార్టూనిస్ట్‌ సుధీర్‌నాథ్‌ పేర్కొన్నారు. 

కాగా రాజకీయ కార్టూన్‌లకు ప్రసిద్ధి చెందిన ఏసుదాసన్ అనేకసార్లు కేరళ ప్రభుత్వ ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డును అందుకున్నారు. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్ అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక పురస్కారం, ఎన్ వి పైలీ అవార్డులను స్వీకరించారు. 1938లో అలప్పు జిల్లాలోని భారైకావులో జన్మించిన ఏసుదాసన్ మలయాళ మనోరమకు కార్టూనిస్ట్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఏసుదాసన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు

మరిన్ని వార్తలు