విషాదం: ఆ పాప ఇక లేదు.. మీ విరాళాలు తిరిగిచ్చేస్తాం!

15 Jun, 2021 15:31 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ బికనీర్‌కు చెందిన ఏడు నెలల చిన్నపాప నూర్‌ ఫాతిమా స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపీ(ఎస్‌ఎమ్‌ఏ) వంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ మంగళవారం ఉదయం మరణించింది. ఆ చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ మాత్రమే  ఆధారం.సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్‌ వాడాల్సి వస్తుంది.ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అయితే పాప తండ్రి జిసాన్‌ అహ్మద్‌ ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తమ బిడ్డపై ఆశలు వదిలేసుకున్నారు.

అయితే ఇటీవలే  హైదరాబాద్‌కు చెందిన అయాన్ష్‌ గుప్తా ఇదే వ్యాధితో బాధపడుతున్న వేళ క్రౌడ్‌ ఫండింగ్‌ పేరిట ఏడాది పాటు ఇంపాక్ట్‌ గురు సంస్థ ఆన్‌లైన్‌ వేదికగా రూ. 16 కోట్లు విరాళాలు సేకరించి ఆ బాబును బతికించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిసాన్‌ అహ్మద్‌కు మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో పాప ఇంజెక్షన్‌కు విరాళాలు సేకరించేందుకు తన మిత్రులు, సోషల్‌ మీడియా గ్రూఫ్‌లను సంప్రదించాడు. అలా ఇప్పటివరకు క్రౌడ్‌ ఫండింగ్‌ పేరిట రూ. 40 లక్షలు పోగయ్యాయి. కానీ దురదృష్టంకొద్ది ఆ చిన్నారి మంగళవారం కన్నుమూయడంతో విరాళం అందించిన వారు పాపను బతికించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు.

ఇదే  విషయమై.. పాప తండ్రి జిసాన్‌ అహ్మద్‌ స్పందించాడు. '' ఉదయం నాలుగు గంటల సమయంలో పాప బాగానే ఉంది. ఆకలితో ఏడ్వడంతో పాపకు పాలు పట్టిచ్చి మళ్లీ నిద్రపుచ్చాం. కానీ ఉదయం ఏడు గంటల సమయంలో పాపను లేపడానికి ప్రయత్నించగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులున్నట్లు గమనించాం. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు దృవీకరించారు. పాప ఇంజెక్షన్‌ కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ పేరిట విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇంజెక్షన్‌కు రూ. 16 కోట్లు అవసరం కాగా.. ఇప్పటివరకు రూ. 40లక్షలు సేకరించాం. అయితే పాప చనిపోవడంతో మాకు విరాళం అందించిన వారికి డబ్బు తిరిగిచ్చేస్తాం.'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.  
చదవండి: 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ

మరిన్ని వార్తలు