Kanpur: 18 నెలలుగా ఇంట్లోనే మృతదేహంతో కుటుంబం..గంగా జలం చల్లుతూ..!

24 Sep, 2022 08:11 IST|Sakshi

తిరువనంతపురం: కోమాలోకి వెళ్లిన వ్యక్తి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో వైద్యులు సైతం చెప్పలేరు. అందుకు రోజుల నుంచి సంవత్సరాలు పడుతుంది. అలా.. ఓ వ్యక్తి మరణించినప్పటికీ కోమాలో ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి స్పృహలోకి వస్తాడని నమ్మిన ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసింది. దాదాపు 18 నెలలుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసి.. ప్రతిరోజు గంగా జలం చల్లుతున్న ఈ సంఘటన కేరళలోని కన్నూర్‌ జిల్లాలో జరిగింది. 

ఏం జరిగింది?
ఆదాయ పన్ను విభాగంలో పని చేస్తోన్న విమలేశ్‌ దీక్షిత్‌ అనే వ్యక్తి గత ఏడాది ఏప్రిల్‌లో గుండె పోటుతో మరణించాడు. కానీ, అతడు కోమాలో ఉన్నాడని భావించిన కుటుంబం అంత్యక్రియలను నిర్వహించేందుకు అంగీకరించలేదు. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచేశారు. ఈ క్రమంలోనే కుటుంబానికి అందాల్సిన పింఛన్‌ దస్త్రాలు ముందుకు కదలటం లేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు చీఫ్ మెడికల్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీంతో పోలీసులతో కలిసి ఆరోగ్య విభాగం అధికారులు రావత్‌పుర్‌లోని దీక్షిత్‌ ఇంటికి శుక్రవారం వెళ్లారు. ఆయన కోమాలోనే ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో దీక్షిత్ బాడీని లాలా లజపత్‌ రాయ్‌ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. మృతి చెందినట్లు నిర్ధరించారు. 

మరోవైపు.. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త మరణంతో మానసిక రోగిగా మారిన అతడి భార్య.. ప్రతిరోజు ఉదయం మృతదేహంపై గంగాజలం చల్లుతున్నట్లు చెప్పారు. కోమా నుంచి బయటపడేందుకు గంగా జలం దోహదపడుతుందని ఆమె నమ్ముతున్నారని తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. గుండె పోటుతో 2021, ఏప్రిల్‌ 22న దీక్షిత్‌ మరణించాడని వెల్లడించారు. చుట్టుపక్కల వారికి సైతం దీక్షిత్‌ కోమాలోనే ఉన్నాడని చెప్పేవారని, కొన్ని సార్లు ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకెళ్లటం గమనించినట్లు స్థానికులు తెలిపినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు

మరిన్ని వార్తలు