కుటుంబం ఆత్మహత్య.. అప్పుల వేధింపులే కారణం?

28 Jan, 2021 11:12 IST|Sakshi

బెంగళూరు: తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడం.. బాకీ తీర్చాలని అప్పు ఇచ్చినవారు వేధించడంతో ఓ కుటుంబం మనస్తాపానికి గురైంది. అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబమంతా సామూహిక బలవన్మరణానికి పాల్పడింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రం బెల్గామ్‌ జిల్లా రాయ్‌బాగ్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాయ్‌బాగ్‌ తాలుకలోని భీరాడి గ్రామానికి చెందిన అన్నప్ప (60), మహాదేవి (50) భార్యాభర్తలు. వారికి సంతోశ్‌ (26), దత్తాత్రేయ (28) ఇద్దరు కుమారులు ఉన్నారు. నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి వారు మృతి చెందారు. దీంతో వారు చెల్లాచెదురుగా పడిపోయారు. అయితే గురువారం తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియడం లేదు. కాకపోతే అప్పులతో పాటు అప్పు ఇచ్చిన వారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు