రాజకీయాల్లోకి రావాలి! 

31 Oct, 2020 06:47 IST|Sakshi

అభిమానుల బైఠాయింపు

దీక్షతోనైనా ఒప్పిస్తాం!

ఫిబ్రవరిలో మహానాడుగా సరికొత్త ప్రచారం 

సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంత్‌ రాజకీయాలు మొదటి నుంచి గందరగోళంగానే సాగుతున్నాయి. కలకలం రేపే సమాచారంతో రజనీ పేరుతో వెలువడిన ఉత్తరం, రజనీకాంత్‌ గురువారం చేసిన ట్వీట్‌కు కొనసాగింపుగా శుక్రవారం మరికొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయాలకు స్వస్థి పలకనున్నట్లుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం వెలుగుచూడడంతో రజనీకాంత్‌ అభిమానులు చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి ముందు శుక్రవారం భైఠాయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు...రజనీ రాజకీయాల్లోకి రావాలి అంటూ నినాదాలు చేశారు. అభిమాన సంఘాలను మక్కల్‌ మన్రాలుగా మార్పులు చేయడంతోపాటూ సభ్యత్వ నమోదు ద్వారా రజనీకాంత్‌ బలోపేతం చేశారు. అ«ధ్యాత్మిక పాలనను అందిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. కరోనా కారణంగా ఏడునెలలుగా బాహ్యప్రపంచానికి దూరంగా మెలుగుతున్నారు. (చదవండి: రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై మళ్లీ సస్పెన్స్‌)

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఏర్పాటుపై సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు గురువారం రజనీ చేసిన ప్రకటన అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు.  నిరాహారదీక్షలు చేపట్టైనా రజనీతో పార్టీ పెట్టిస్తామని రజనీ మక్కల్‌ మన్రం చెన్నై ఎగ్మూరు శాఖ ఉప కార్యదర్శి కే రజనీ అన్నారు. రజనీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని నమ్ముతున్నట్లు అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారుతుంది, రాజకీయాలు మారుతాయి అనే నినాదంతో కూడిన బనియన్లు వేసుకున్నారు.

మీ ఆరోగ్యం, సంతోషం మాకు ఎంతో ముఖ్యం, వీటిని దృష్టిలో ఉంచుకుని మీరు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తామని బీజేపీ నేత, సినీ నటి కుష్బూ ప్రకటించారు. తన ఆరోగ్య పరిస్థితిని రజనీ స్పష్టం చేశారు. రాజకీయపరమైన నిర్ణయాన్ని త్వరలో అభిమానుల ముందు ప్రకటిస్తారని చెన్నై కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ కరాటే త్యాగరాజన్‌ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో మరో సరికొత్త అనధికారిక సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ‘అభిమానుల తీవ్ర అసంతృప్తితో దిగొచ్చిన రజనీకాంత్‌ మనసు మార్చుకున్నారు..వచ్చే¯ð నెల మక్కల్‌ మన్రం నిర్వాహకులతో సమావేశం అవుతున్నారు...వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారీ మహానాడుతో ప్రజల ముందుకు రానున్నారు’ అని అందులోని సమాచారం. ఏది నిజం, ఏది అబద్దం అని తలలు పట్టుకోవడం రాజకీయవర్గాల వంతుగా మారింది.  

మరిన్ని వార్తలు