పప్పా నా హీరో, బెస్ట్‌ ఫ్రెండ్‌..బిగ్గెస్ట్‌ మోటివేటర్‌:  బ్రిగేడియర్‌ లిడ్డర్‌ కుమార్తె కన్నీరు 

10 Dec, 2021 13:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులోని ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన బాసిన బ్రిగేడియర్‌ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌ స్క్వేర్‌ క్రిమటోరియంలో శనివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా  లిడ్డర్‌  సతీమణి గీతిక, కుమార్తె అస్నా భావోద్వేగానికి  లోనుకావడం అక్కడున్న వాందరి కళ్ళల్లో కన్నీరు నింపింది.   (రావత్‌ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి)

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అమరుడయ్యారన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి పార్థివ దేహాన్ని ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆస్రా మాట్లాడుతూ ఆయన అకాల మరణం  జాతికి తీరని నష్టం. నన్ను చాలా గారాబం చేసేవారు.. ఇపుడు భయంగా ఉంది. నాకిపుడు 17 ఏళ్లు. ఈ 17 ఏళ్లు నాన్న నాతో ఉన్నారు. ఆ సంతోషకరమైన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తా. మా పప్పా నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నా బిగ్గెస్ట్‌  మోటివేటర్‌ అంటూ కంటతడి పెట్టారు. 

బ్రిగేడియర్‌ లిడ్డర్‌ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు.  ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు గీతిక. అనంతరం సతీమణి గీతిక మాట్లాడుతూ  ‘‘ఆయన చాలా మంచి మనిషి, స్నేహ శీలి..అందుకే నవ్వుతూ సాగనంపుతామని  వచ్చా ఆయన మంచి తండ్రి. నా బిడ్డ ఆయనను చాలా మిస్‌ అవుతుంది.  ఆయన లేకుండా జీవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది.  చాలా  నష్టం. కానీ విధి అలా ఉంది..గర్వంగా కంటే చాలా బాధగా ఉంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు.   

కాగా తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లిడ్డర్‌తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే.  లిడ్డర్‌ జనరల్ రావత్‌కు రక్షణ సలహాదారుగా ఉన్నారు. లిడ్డర్‌ మేజర్ జనరల్ ర్యాంక్‌కి పదోన్నతి పొందాల్సి ఉంది.  లిడ్డర్‌కు 2020లో సేన మెడల్, విశిష్ట​ సేన పతకం లభించింది. గతంలో కశ్మీర్‌లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించారు.

మరిన్ని వార్తలు