వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలే

26 Sep, 2020 02:54 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: రైతుల విషయంలో ఎప్పుడూ అసత్యాలే పలికిన వాళ్లు ఇప్పుడు వారి ఆసరాతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రధాని మాట్లాడుతూ 85% ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసే చట్టం ఒకటి తయారవడం దశాబ్దాల్లో ఇది మొదటిసారని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ, కార్మిక చట్టాల సంస్కరణల కోసం తీçసుకొచ్చిన బిల్లులను పూర్తిగా సమర్థించుకున్నారు.

పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు చేస్తున్న  ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. ‘‘వాళ్లు వదంతులు ప్రచారం చేస్తున్నారు. వీటి నుంచి రైతులను రక్షించాలంటే కొత్త వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యతను వారికి వివరించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత బీజేపీ కార్యకర్తలు తీసుకోవాలి. రైతుల భవిష్యత్తును ప్రకాశవంతం చేయాలి’’అని ఉద్బోధించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కార్మిక సంస్కరణలు దేశవ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూర్చనుందని, స్థిరమైన ఆదాయంతోపాటు ఆరోగ్య సేవలు అందించేలా చేస్తాయని ప్రధాని తెలిపారు. ఇప్పటివరకూ కేవలం 30 శాతం మందికి కనీస వేతన చట్టం వర్తించేదని, కొత్త చట్టాల వల్ల అసంఘటిత రంగ కార్మికులందరికీ అమల్లోకి వస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు