పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు

24 Nov, 2021 09:02 IST|Sakshi

లోక్‌సభ  బిజినెస్‌ విడుదల

నవంబరు 29 నుంచి డిసెంబరు 23 దాకా సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్‌ లాస్‌ రిపీల్‌ బిల్‌ 2021 టు రిపీల్‌ త్రీ ఫామ్‌ లాస్‌’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్‌ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
చదవండి: ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్‌ కొట్టివేత

ఉభయసభల్లో చేపట్టనున్న బిల్లుల్లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్లాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు కూడా ఉండటం గమనార్హం. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పెంచేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌లు తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా తాత్కాలికంగా దఖలుపడిన అధికారాలను చట్టరూపంలో శాశ్వతం చేయనుంది.
చదవండి: సాగు చట్టాల నివేదిక విడుదల చేయండి

నాలుగునెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎస్టీ, ఎస్సీ కులాల జాబితాలో మార్పుచేర్పులు చేసే చట్టాన్ని కూడా కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. త్రిపుర ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది. హైకోర్టు– సుప్రీంకోర్టు జడ్జీల (సర్వీసు నిబంధనలు, వేతనాలు) సవరణ బిల్లు–2021ను కూడా కేంద్రం రాబోయే సమావేశాల్లో ఉభయసభల ముందుంచనుంది. మనుషుల అక్రమ రవాణా (నిరోధం, రక్షణ, పునరావాసం) బిల్లు–2021 కూడా ఈ 26 బిల్లుల జాబితాలో ఉంది. నవంబరు 29న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు డిసెంబరు 23వ తేదీదాకా జరిగే విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు