విజయ సారథులు వీరే

20 Nov, 2021 05:57 IST|Sakshi

న్యూఢిల్లీ :  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్‌ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి , ఢిల్లీ పోలీసు మాజీ కానిస్టేబుల్‌ ఇలా ఎందరో ఉన్నారు. ఏడాది పాటు ఉద్యమాన్ని సజీ వంగా నిలిపి ఉంచడానికి వీరంతా పాటుపడ్డారు.  

రాకేశ్‌ తికాయత్‌  
భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్‌ తికాయత్‌ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ అయిన ఆయన కరకు ఖాకీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు.  ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపారు. 52 ఏళ్ల వయసున్న తికాయత్‌ ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిరసనలు చేపడితే కేంద్రం దిగి వస్తుందన్న వ్యూహాన్ని రచించి ప్రభుత్వంలో కదలిక తెచ్చారు.  

దర్శన్‌పాల్‌
వృత్తిరీత్యా డాక్టర్‌ అయిన దర్శన్‌పాల్‌ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను ఏకం చేశారు. 40 రైతు సంఘాలను ఒకే గూటికి తీసుకువచ్చి కిసాన్‌ ఏక్తా జిందాబాద్‌ నినాదంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అఖిల భారత సంఘర్‌‡్ష సమన్వయ కమిటీ సభ్యుడైన దర్శన్‌ పాల్‌ పంజాబ్‌ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

జోగిందర్‌ సింగ్‌
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు అయిన జోగిందర్‌  సింగ్‌ ఉగ్రహాన్‌ ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు. రైతు సంఘాల్లో అత్యధికం సింఘూ సరిహద్దుల్లోనే ఉద్యమిస్తే టిక్రీలో ఉద్యమాన్ని జోగిందర్‌ సింగ్‌ ఒంటిచేత్తో నడిపించారు. రైతు నిరసనల్లో దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. రైల్‌ రోకోలు, బీజేపీ నేతల ఘొరావ్‌లలో జోగిందర్‌ సింగ్‌ ఎప్పుడూ ముందుండేవారు.  

బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధ్యక్షుడు అయిన బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడడంలో దిట్ట. 78 ఏళ్ల వయసున్న ఈ రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో చర్చల సమయంలో తమ వాదనల్ని గట్టిగా వినిపించేవారు. అంతేకాదు రైతులు చేయాల్సిన నిరసనలపై బల్బీర్‌సింగే ప్రణాళికలు రచించి ముందుకి నడిపించారు.  

సుఖ్‌దేవ్‌ సింగ్‌ కొక్రికలన్‌
స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్‌ అయిన 71 ఏళ్ల సుఖ్‌దేవ్‌ సింగ్‌ పోలీసులతో ఘర్షణలు జరిగినప్పుడల్లా తానే ముందు ఉండేవారు. ఛలో ఢిల్లీ ఆందోళన సమయంలో పోలీసులకు ఎదురెళ్లి నిలుచున్న సాహసి. బీకేయూ, ఉగ్రహాన్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుఖ్‌దేవ్‌ సహ రైతులకు రక్షణగా ఎప్పుడూ తానే ముందుండేవారు.

మరిన్ని వార్తలు