ఇది పోలీసుల హత్యే!

1 Sep, 2021 06:08 IST|Sakshi

హరియాణాలో చనిపోయిన రైతు సుశీల్‌ కాజల్‌ కుటుంబం ఆరోపణ

సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని కర్నాల్‌ జిల్లా రాయ్‌పూర్‌ జట్టన్‌  గ్రామానికి చెందిన రైతు సుశీల్‌ కాజల్‌ మృతికి పోలీసులే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జ్‌ వల్లనే రైతు సుశీల్‌ మరణించాడని ఆయన భార్య సుదేష్‌ దేవీ, తల్లి విమర్శించారు. ఆయన పోలీసులు చెబుతున్న విధంగా గుండెపోటుతో మరణించలేదని వారు వాదిస్తున్నారు. పోలీసులు, హరియాణా ప్రభుత్వం కావాలనే సుశీల్‌ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాఠీచార్జ్‌ సందర్భంగా తగిలిన తీవ్రమైన గాయాలు, నొప్పులతో ఇంటికి చేరుకున్న సుశీల్, తల్లి తీసుకొచ్చిన పసుపు కలిపిన పాలను తాగి... తనకు ఏమీ తినాలని అనిపించట్లేదని చెప్పి పెయిన్‌ కిల్లర్‌ మాత్రలను వేసుకొని పడుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే రాత్రి నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు విడిచారని ఆయన భార్య, తల్లి వివరించారు.

గాయాలకు, మరణానికి సంబంధం లేదు: కర్నాల్‌ ఎస్పీ పునియా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 28న కర్నాల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోలో సుశీల్‌ కాజల్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. ఆ ఘటనలో గాయపడ్డ రైతుల్లో సుశీల్‌ కాజల్‌ ఒకరు. అదే రోజు రాత్రి లాఠీచార్జ్‌లో తగిలిన దెబ్బలతో ఇంటికి వచ్చిన సుశీల్‌ తెల్లారేసరికి విగతజీవిగా మిగిలిపోయాడు. కాగా  కర్నాల్‌ ఎస్పీ గంగారామ్‌ పునియా మాత్రం పోలీసులతో జరిగిన ఘర్షణలో తగిలిన గాయాలకు, అతని మరణానికి సంబంధం లేదని ప్రకటించారు. కాగా సుశీల్‌ స్నేహితులు, కుటుంబం, రైతు సంఘాల నాయకులు మాత్రం ఇది పోలీసుల హత్యేనని అంటున్నారు. 

రైతు ఉద్యమంలో చురుగ్గా: రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి  రైతు సుశీల్‌ కాజల్‌తో పాటు ఆయన తల్లి, భార్య సుదేష్‌ దేవి, కుమారుడు సాహిల్, కుమార్తె అన్నూ నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే రైతు ఉద్యమంలో పాల్గొన్న సమయంలో సుశీల్‌ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో ఉంది. కాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కాని, పోలీసులు కాని తమ ఇంటికి రాలేదని, కానీ సుశీల్‌ మరణాన్ని గుండెపోటులా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుశీల్‌కు 1.5 ఎకరాల భూమితో పాటు ఉన్న కొద్దిపాటి పాడి వారి జీవనాధారం అని, కుటుంబం  వాటిపైనే ఆధారపడి జీవిస్తోందని గ్రామస్తులు తెలిపారు.

రూ.లక్ష సాయం అందించిన ఆలిండియా కిసాన్‌ సంఘం
రాయ్‌పూర్‌ జట్టన్‌ గ్రామంలో చనిపోయిన రైతు సుశీల్‌ కాజల్‌æ కుటుంబాన్ని ఎఐకెఎస్‌ ప్రతినిధి బృందం మంగళవారం పరామర్శించి రూ.లక్ష సాయం అందించింది. చెక్కును సుశీల్‌ భార్య సుధేష్‌ దేవికి ఎఐకెఎస్‌ కోశాధికారి పి.కృష్ణప్రసాద్‌ తదితరులు అందించారు. వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్నాల్‌లోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు.

మరిన్ని వార్తలు