8న భారత్‌ బంద్‌

5 Dec, 2020 05:26 IST|Sakshi
ఢిల్లీ నిరసనలకు మద్దతుగా పశ్చిమబెంగాల్‌లో వామపక్ష రైతు సంఘాల ఆందోళన

రైతు సంఘాల పిలుపు

దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం

నేడు కేంద్రంతో మళ్లీ చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్‌ సింగ్‌ లఖ్వాల్‌ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థల దిష్టిబొమ్మలను  నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు.

గణతంత్ర దినోత్సవ కవాతులో రైతులు పాల్గొనాలని ఢిల్లీ –ఘజియాబాద్‌ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్‌ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లాహ్‌ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్‌ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని మొల్లాహ్‌ హెచ్చరించారు.

కెనడాకు వార్నింగ్‌
గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. రైతులు చేస్తున్న నిరసనలు పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ భారత్‌లో కెనడా హైకమిషనర్‌ నాదిర్‌ పటేల్‌ను శుక్రవారం హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కెనడా ప్రధాని, కేబి నెట్‌ మంత్రులు భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందించడాన్ని తప్పుబడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.  

మరిన్ని వార్తలు