ఢిల్లీలో 26నాటి ఘటనపై న్యాయ విచారణ

14 Feb, 2021 06:11 IST|Sakshi
ఘాజీపూర్‌లో నిరసన వేదికపై తికాయత్‌తో గాంధీజీ మనవరాలు తారా గాంధీ

రైతు సంఘాల డిమాండ్‌

‘తప్పడు’ కేసులు వేశారని ఆరోపణ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26వ తేదీన ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. అప్పటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం రైతులపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించిందని ఆరోపించాయి. సింఘు వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు నోటీసులు అందుకున్న రైతులు నేరుగా వారి వద్దకు వెళ్లకుండా, అవసరమైన సాయమేదైనా రైతు సంఘాల న్యాయ విభాగాల నుంచి పొందాలని సూచించారు. జనవరి 26వ తేదీ నాటి హింసాత్మక ఘటనలకు, రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర దాగుందని ఎస్‌కేఎం న్యాయ విభాగం సభ్యుడు కుల్దీప్‌ సింగ్‌ ఆరోపించారు.


ఈ ఘటనలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొన్న 16 మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఆ ఘటనలపై నమోదైన మొత్తం 44 ఎఫ్‌ఐఆర్‌లలో 14 ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి 122 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారని, వారందరికీ న్యాయ, ఆర్థిక సాయం అందజేస్తామని మరో నేత రవీందర్‌ సింగ్‌ తెలిపారు. కొందరు రైతులపై దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు కూడా పెట్టారన్నారు. భోజనం ఖర్చుల కోసం జైలులో ఉన్న రైతులకు రూ.2 వేల చొప్పున ఎస్‌కేఎం అందజేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు జైలులో ఉన్న 10 మంది రైతులకు బెయిల్‌ మంజూరు కాగా, మరో ఐదుగురి బెయిల్‌కు దరఖాస్తు చేశామన్నారు.

తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు కాని వారిపై మొదట దృష్టి పెట్టినట్లు చెప్పారు. తీహార్‌ జైలులో ఉన్న 112 మంది రైతులను తమ న్యాయ విభాగం కలిసిందని వెల్లడించారు. ఇలా ఉండగా, ట్రాక్టర్‌ పరేడ్‌ సమయంలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న నటుడు దీప్‌ సిద్దు, ఇక్బాల్‌ సింగ్‌ అనే మరో వ్యక్తిని దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నేర విభాగం పోలీసులు శనివారం ఘటనాస్థలికి తీసుకువచ్చి, సీన్‌ రిక్రియేట్‌ చేయించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 500 మంది పోలీసులు గాయపడగా, ఒక ఆందోళనకారుడు చనిపోయిన విషయం తెలిసిందే.

రైతుల ఆందోళనకు గాంధీజీ మనవరాలు మద్దతు
ఘజియాబాద్‌: మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ(84) రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. గాంధీ నేషనల్‌ మ్యూజియం చైర్‌ పర్సన్‌ కూడా అయిన భట్టాచార్జీ శనివారం ఘాజీపూర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్‌ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో మాట్లాడారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని వారిని కోరిన ఆమె.. రైతులపట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

‘రాజకీయ కార్యక్రమంలో భాగంగా మేం ఇక్కడికి రాలేదు. మనల్ని పోషిస్తున్న రైతుల కోసం మాత్రమే వచ్చాం. అన్నదాతల కష్టాన్ని విస్మరించరాదు. రైతులకు లబ్ధి దేశానికే లబ్ధి’అని ఆమె అన్నారని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) తెలిపింది. ఆమె వెంట మహాత్మా స్మారక్‌ నిధి చైర్మన్‌ రామచంద్ర రాహి, ఆల్‌ ఇండియా సర్వ్‌ సేవా సంఘ మేనేజింగ్‌ ట్రస్టీ అశోక్‌ సరన్, గాంధీ స్మారక్‌ నిధి డైరెక్టర్‌ సంజయ్‌ సింఘా, నేషనల్‌ గాంధీ మ్యూజియం డైరెక్టర్‌ అన్నామలై ఉన్నారు.

మరిన్ని వార్తలు