ఎమ్మెల్యేను పరిగెత్తించి.. బట్టలు చింపేసి దాడి

27 Mar, 2021 20:19 IST|Sakshi

చంఢీఘర్‌: కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యేపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఎమ్మెల్యేను పరుగులు పెట్టించిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అక్కడ పోలీసులు ఉన్నా కూడా రైతులు వినకుండా ఎమ్మెల్యేను చితకబాదారు. తమకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

పంజాబ్‌లోని ముక్తాసార్‌ జిల్లా మాలోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌ పర్యటించారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతు సంఘాల నాయకులు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించి కేంద్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. రైతులను చూసి ఎమ్మెల్యే నారంగ్‌ అక్కడ ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేందుకు పరుగెత్తారు. వారి వెంట రైతులు కూడా వెళ్లారు. 

ఎమ్మెల్యే నారంగ్‌పై రైతులు ముప్పేటా దాడి చేశారు. కర్రలు పట్టుకుని వెంటపడ్డారు. దీంతోపాటు ఎమ్మెల్యేపై నల్ల ఇంకు చల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బట్టలు చిరిగిపోయాయి. వెంటనే పోలీసులు కల్పించుకుని రైతులను చెదరగొట్టి వెంటనే ఎమ్మెల్యే నారంగ్‌ను ఓ సెట్టర్‌ లోపలికి పంపించి రక్షించారు. అనంతరం రైతులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడి పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనలో రైతులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.


చదవండి: ‘ప్లీజ్‌ మా చెల్లి వెంటపడొద్దు’
చదవండి: పొలంలో కుప్పకూలిన విమానం

మరిన్ని వార్తలు