రైతుల పాలిట రక్షణ కవచాలు

19 Sep, 2020 05:05 IST|Sakshi

వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోదీ

విపక్షాలు తప్పుదోవపట్టిస్తున్నాయని మండిపాటు

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు చరిత్రాత్మకం అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అవి రైతు వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కేంద్రంలో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కి చెందిన మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని ఆ బిల్లుల్ని గట్టిగా సమర్థించారు. రైతులు, వినియోగదారుల మధ్య దళారీ వ్యవస్థ నుంచి కాపాడే రక్షణ కవచాలని వ్యాఖ్యానించారు. బిహార్‌లో పలు రైల్వే ప్రాజెక్టుల్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని తన ప్రసంగంలో ఈ బిల్లుల గురించే ఎక్కువగా మాట్లాడారు. రైతులకు స్వేచ్ఛ కల్పించడం కోసం రక్షణగా ఆ బిల్లుల్ని తీసుకువస్తే విపక్షాలు దళారులకు కొమ్ము కాస్తూ రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.

ఈ బిల్లులు అత్యంత అవసరం
21వ శతాబ్దంలో ఈ బిల్లుల అవసరం చాలా ఉందన్నారు. రైతుల్ని సంకెళ్లలో బంధించకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే అవకాశం వస్తుందని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఇక వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయదని, కనీస మద్దతు ధర ఇవ్వదని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ) చట్ట సవరణల్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇవే అంశాలను ఉంచిందని మోదీ ధ్వజమెత్తారు. దళారులకు ఎవరు కొమ్ము కాస్తున్నారో, తమకు అండగా ఎవరున్నారో అన్నదాతలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుందని, కనీస మద్దతు ధర ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.

ఎంఎస్పీని తొలగించే కుట్ర: కాంగ్రెస్‌
తాజాగా తీసుకువచ్చిన మూడు బిల్లుల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించే విధానాన్ని తొలగించే కుట్ర చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరింది. రైతుల కోసం పార్లమెంటు వెలుపల, లోపల పోరాడుతామని స్పష్టం చేసింది. మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రైతుల పొట్టగొట్టి, తన స్నేహితులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శుక్రవారం ట్వీట్‌ చేశారు. పార్లమెంటు తాజాగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులు  కనీస మద్దతు ధర విధానాన్ని నాశనం చేస్తాయని మరో సీనియర్‌ నేత పీ చిదంబరం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు