రైతుల రైల్‌ రోకో

19 Feb, 2021 04:42 IST|Sakshi
రైలు రోకోలో భాగంగా పంజాబ్‌లోని పటియాలాలో రైలు పట్టాలపై బైఠాయించిన రైతులు

పంజాబ్, హరియాణాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ

కొద్దిపాటి ప్రభావమేనన్న రైల్వే శాఖ

న్యూఢిల్లీ/హిసార్‌: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు గురువారం నాలుగు గంటలపాటు రైల్‌ రోకో చేపట్టాయి. ఆందోళనలతో రైలు సర్వీసులపై కొద్దిపాటి ప్రభావమే పడిందని రైల్వేశాఖ తెలిపింది. కొన్ని రైళ్లను ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లలోనే నిలిపివేసినట్లు వెల్లడించింది. పంజాబ్, హరియాణాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు రైలు పట్టాలపై బైఠాయించడంతో కొన్ని మార్గాల్లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ అక్కడక్కడా ఆందోళనలు జరిగాయి. చాలా వరకు రాష్ట్రాల్లో రైల్‌ రోకో ప్రభావం నామమాత్రంగా కనిపించింది. దేశవ్యాప్త రైల్‌ రోకోకు భారీగా స్పందన లభించినట్లు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రకటించింది. మోదీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక వంటిదని వ్యాఖ్యానించింది. డిమాండ్లు సాధించేదాకా పోరాటం కొనసాగించేందుకు రైతులు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపింది.

అవాంఛనీయ ఘటనలు లేవు
‘రైల్‌ రోకో సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై రైల్‌ రోకో ప్రభావం కొన్ని చోట్ల నామమాత్రం, మరికొన్ని చోట్ల అస్సలు లేనేలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత రైళ్లు యథావిధిగా నడిచాయి’ అని రైల్వే శాఖ ప్రతినిధి తెలిపారు. రైల్‌ రోకో నేపథ్యంలో ముందుగానే రైల్వే శాఖ 25 రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించింది. ముందు జాగ్రత్తగా ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను మోహరించింది. హరియాణాలోని అంబాలా, కురుక్షేత్ర, చర్ఖిదాద్రి రైల్వేస్టేషన్లలో రైతులు పట్టాలపై బైఠాయించారని రైల్వే శాఖ వెల్లడించింది.పంజాబ్‌లో ఢిల్లీ–లూధియానా–అమృత్‌సర్‌ మార్గం, జలంధర్‌–జమ్మూ మార్గాల్లోని పట్టాలపై రైతులు కూర్చున్నారు. రాజస్తాన్‌లో రెవారీ–శ్రీగంగానగర్‌ స్పెషల్‌ రైలును మాత్రమే ఆందోళనల కారణంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

మీ పంటలను త్యాగం చేయండి: తికాయత్‌
చట్టాలను వాపసు తీసుకునే వరకు రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లబోరని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటను త్యాగం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ‘పంటకు నిప్పు పెట్టాల్సిన అవసరం వచ్చినా అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. పంటలు కోతకు రానున్నందున రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం భావించరాదు’అని తెలిపారు. ఆందోళనలను ఉధృతం చేయాలంటూ రైతు సంఘాలు ఇచ్చే పిలుపునకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘మీ ట్రాక్టర్లలో ఇంధనం నిండుగా నింపి, ఢిల్లీ వైపు తిప్పి సిద్ధంగా ఉంచండి. రైతు సంఘాల కమిటీ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చు’అని చెప్పారు. ఈ దఫా ఢిల్లీలో చేపట్టే ట్రాక్టర్‌ ర్యాలీలకు వ్యవసాయ పనిముట్లు కూడా తీసుకురావాలని రైతులను కోరారు.
 

మరిన్ని వార్తలు