ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్

26 Nov, 2020 10:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌ ‌: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్‌ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని బాటపట్టారు. వారిని నిలువరించేందుకు హర్యానా సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. అంతేకాకుండా పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రైతులను జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. 

రైతుల నిరసనల నేపథ్యంలో రెండు రోజుల పాటు పంజాబ్‌కు బస్సు సర్వీసులను హర్యానా ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హర్యానాలో బారీగేట్లను పెట్టి ట్రాఫిక్‌ను మళ్లించారు. పంజాబ్‌కు చెందిన వేలాది రైతులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కవాతుగా గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. వారంతా హర్యానా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా ప్రభుత్వం తన  భద్రతా సిబ్బందిని సరిహద్దుల దగ్గర మోహరించింది. కరోనావైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో ఎటువంటి ర్యాలీని అనుమతించడం లేదు. ఢిల్లీ సరిహద్దులైన గురుగ్రామ్, ఫరీదాబాద్ వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

పంజాబ్‌ దారులన్నీ మూసివేత..
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకు గురువారం, శుక్రవారం పంజాబ్ సరిహద్దులను మూసివేశారు. నిరసన మార్చ్‌ను అడ్డుకునేందుకు పంజాబ్ రోడ్లపై బారికేడ్లు, వాటర్ ఫిరంగులు, పోలీసు వాహనాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సమావేశాలను అనుమతించకుండా, నిషేధ ఉత్తర్వులు రాష్ట్రంలో విధించారు. రెండు లక్షల మంది రైతులు హర్యానాకి చేరుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా-ఉగ్రహాన్) పేర్కొంది. ఈ ర్యాలీకి అవసరమైన రేషన్, కూరగాయలు, కలప, ఇతర నిత్యావసర వస్తువులను రైతులు తీసుకొచ్చారు. చలి కాలం కావడంతో దుప్పట్లు కూడా వెంటతెచ్చుకున్నారు. "మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, ఈ పోరాటం చాలా కాలం జరగవచ్చు"  అని బీకేయు (ఏక్తా-ఉగర్హాన్) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ అన్నారు. ఈ విషయం పరిష్కారం అయ్యేవరకు తిరిగి రామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఢిల్లీకి రావద్దు: పోలీసులు
రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సైతం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సరిహద్దుల వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా ఘాజిపూర్ సరిహద్దు, చిల్లా సరిహద్దు, డిఎన్‌డిపై దృష్టి సారించింది. ఎనిమిది కంపెనీల పారామిలిటరీ దళాలు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ ప్రభుత్వం మెట్రో సర్వీసులను కుదించింది. పలు రైతు సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలన్నీ తిరస్కరించామని, ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపామని ఢిల్లీ పోలీసులు బుధవారం ట్వీట్ చేశారు. "కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో ఎటువంటి సమావేశాలు జరపకూడదు, దయచేసి ఢిల్లీ పోలీసులతో సహకరించండి " అని మరో ట్వీట్‌లో అభ్యర్ధించారు. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ వరుస ట్వీ‍ట్స్‌తో నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల సంఘాలను కేంద్రం డిసెంబర్ 3 న రెండవ విడత చర్చలకు పిలిచింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా