ఎన్‌ఓసీ జారీ చేసిన ఢిల్లీ పోలీసులు

25 Jan, 2021 19:18 IST|Sakshi

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతులిస్తూ ఢిల్లీ పోలీసులు ఎన్‌ఓసీ జారీ చేశారు. ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించిన 37 నిబంధనలను రైతు సంఘాల నేతలు ఒప్పుకోవడంతో శాంతియుతంగా ర్యాలీ చేసుకునేందుకు వారికి అనుమతులు జారీ చేశారు. రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతుల ఆందోళనలు ట్రాక్టర్ ర్యాలీతో మరింత ఉధృతంగా మారతాయన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఢిల్లీ, హర్యాణా పోలీసులు.. మొదట్లో ఈ ర్యాలీకి ససేమిరా అన్నారు. 

రైతుల ట్రాక్టర్లలో డీజిల్ పోయొద్దని పెట్రోల్ బంకులకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శాంతియుతంగా చేయాలనుకున్న ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి రావడంపై రైతు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు ముందే అనుకున్న విధంగా సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ల నుండి రేపు ర్యాలీగా వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. రైతు ర్యాలీ సందర్భంగా ఢిల్లీ నగరవాసులు ఆయా రూట్లలో ప్రయాణించరాదని ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, రైతులు చేపట్టబోయే ఈ ట్రాక్టర్‌ ర్యాలీ మొత్తం 170 కిలోమీటర్ల పరిధిలో సాగుతుందని, అందులో 100 కిలోమీటర్ల మేర ఢిల్లీ భూభాగం ఉంటుందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు